4నెలలు..4బాధ్యతలు | Police Commissioner Record For Different posts | Sakshi
Sakshi News home page

4నెలలు..4బాధ్యతలు

Published Wed, Mar 14 2018 9:05 AM | Last Updated on Tue, Aug 21 2018 7:58 PM

Police Commissioner Record For Different posts - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: సిటీపోలీస్‌ కమిషనర్‌గా పని చేస్తున్న మహేందర్‌రెడ్డి డీజీపీగా వెళ్లిన తర్వాత సిటీ బాధ్యతలు స్వీకరించిన వీవీ శ్రీనివాసరావు పేరిట అరుదైన రికార్డులు మిగిలిపోతున్నాయి. సుదీర్ఘకాలం పూర్తి అదనపు బాధ్యతల (ఎఫ్‌ఏసీ) పోలీసు కమిషనర్‌గా పని చేయడం ఒకటైతే... ఏకకాలంలో నాలుగు పోస్టులను నిర్వహించారు. వీటిలో మూడు అత్యంత కీలకమైనవి కావడం గమనార్హం. గతేడాది నవంబర్‌ 12 నుంచి సరిగ్గా నాలుగు నెలల పాటు ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా పని చేసిన ఆయన సోమవారం (మార్చ్‌ 12) అంజనీ కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. అయినప్పటికీ ప్రస్తుతం ఆయన చేతిలో అసలు పోస్టు అదనపు సీపీతో (శాంతిభద్రతలు) పాటు మరో రెండు ఉన్నాయి. వీటి అప్పగింతలు పూర్తయితే తప్ప పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు బాధ్యతలు తీసుకునే అవకాశం లేదు. దీనికి మరో మూడునాలుగు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

అంజనీ బదిలీతోనే ఆ స్థానంలోకి...
ఐజీ హోదాలో ఉన్న వీవీ శ్రీనివాసరావు నగర పోలీసు కమిషనరేట్‌లోకి అంజనీ కుమార్‌ స్థానంలోనే వచ్చారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనురాగ్‌ శర్మ తొలి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో జరిగిన బదిలీల్లో నగర అదనపు పోలీసు కమిషనర్‌గా (శాంతిభద్రతలు) ఉన్న అంజనీ కుమార్‌ అదనపు డీజీగా (శాంతిభద్రతలు) బదిలీ అయ్యారు. అప్పట్లో ఆక్టోపస్‌లో పని చేస్తున్న వీవీ శ్రీనివాసరావు అంజనీ స్థానంలో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అదే బాధ్యతల్లో ఉన్న ఆయన మహేందర్‌రెడ్డి డీజీపీగా వెల్లడంతో ఎఫ్‌ఏసీ కొత్వాల్‌ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది నవంబర్‌లో మహేందర్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌ డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే నాటికి నగర పోలీసు కమిషనర్‌ నియామకంపై ఓ స్పష్టత రాకపోవడంతో శ్రీనివాసరావును ఎఫ్‌ఏసీ సీపీగా నియమించింది.

కొత్త అధికారి నియామకం జరిగినా... ఆయన రాకలో ఆలస్యం జరిగే పక్షంలో సదరు అధికారిని రిలీవ్‌ చేసేందుకు ఇన్‌చార్జ్‌ సీపీని నియమిస్తుంటారు. ఇందుకు సంబంధించి జారీ చేసే ఉత్తర్వుల్లో ఆయనకు హెచ్‌ఏసీ (హోల్డింగ్‌ అడిషనల్‌ చార్జ్‌) కమిషనర్‌గా నియమిస్తుంది. అంటే... సదరు అధికారి ఆయన విధులను నిర్వర్తిస్తూనే అదనంగా కమిషనర్‌ బాధ్యతలు చేపట్టాలని అర్థం. పర్యవేక్షణ మినహా హెచ్‌ఏసీ అధికారికి కొత్వాల్‌కు ఉండే ఇతర అధికారాలు ఉండవు. శ్రీనివాసరావుకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆయనను ఎఫ్‌ఏసీ (ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌) కమిషనర్‌గా నియమించింది. దీని ప్రకారం ఆయన అదనపు సీపీ బాధ్యతలు కాకుండా పూర్తి స్థాయిలో కొత్వాల్‌ బాధ్యతలనే నిర్వర్తించారు. 

ఆ తర్వాత మరోటి.
అప్పటికే శ్రీనివాసరావు అదనపు సీపీ బాధ్యతలో పాటు క్రీడల విభాగం అదనపు డీజీ బాధ్యతలనూ నిర్వర్తిస్తున్నారు. ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా నియామకం కావడంతో ఈయన కొత్వాల్‌గా కొనసాగుతూనే మొత్తం మూడు బాధ్యతలను నిర్వర్తించారు. సిటీకి కమిషనర్‌ నియామకం జరగకుండానే స్పెషల్‌ బ్రాంచ్‌ సంయుక్త పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్న ప్రమోద్‌కుమార్‌ను కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఈ బాధ్యతల్నీ సైతం శ్రీనివాసరావుకే అప్పగించింది. ఇలా దాదాపు మూడు నెలల పాటు మొత్తం నాలుగు పోస్టులను ఆయన నిర్వర్తించారు. తాజా బదిలీల్లో పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా నియమితులు కావడంతో సోమవారం సీపీ బాధ్యతలను అంజనీ కుమార్‌కు అప్పగించారు. అదనపు సీపీగా (శాంతిభద్రతలు) రానున్న డీఎస్‌ చౌహాన్, సంయుక్త సీపీగా (స్పెషల్‌ బ్రాంచ్‌) తరుష్‌జోషిలకు సైతం బాధ్యతలు అప్పగించిన తర్వాత శ్రీనివాసరావు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు బాధ్యతలు చేపట్టనున్నారు. అప్పటికే క్రీడల విభాగం అదనపు డీజీ పోస్టు ఆయన చేతిలోనే ఉంటుంది. త్వరలో ప్రభుత్వం పోలీసు విభాగంలో దాదాపు 18 వేల పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో శ్రీనివాసరావుకు కొత్త బాధ్యతలూ అత్యంత కీలకంగా మారనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement