బాధితురాలు లక్ష్మితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన నటి శ్రీరెడ్డి
సాక్షి, బంజారాహిల్స్ : సినీ నటుడు బాలాజీ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ నటి లక్ష్మి మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ పీఎస్‌కు వచ్చిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడారు.. యూసూఫ్‌గూడలో ఉంటున్న తాను తన భర్త చనిపోయిన తర్వాత కుటుంబ భారాన్ని మోస్తున్నానని తెలిపింది. తన కుమార్తె అనారోగ్యం కారణంగా అప్పులపాలైన తాను నటుడు బాలాజీ భార్యకు కిడ్నీ ఇస్తే రూ.20 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడన్నారు. 2016లో విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి జరిగిందని, అయితే రూ. 3 లక్షలు మాత్రమే ఇచ్చి తెల్లకాగితాలపై ఆస్పత్రిలో సంతకాలు చేయించుకుని డబ్బులు ముట్టినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారని ఆరోపించారు.
ఇబ్బందుల్లో ఉన్న తాను న్యాయం కోసం జూబ్లీహిల్స్ పోలీసులు, మానవహక్కుల కమిషన్, ‘మా’ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. శ్రీ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమెకు సినిమా క్యారెక్టర్లు ఇప్పిస్తానని, తన ఇంటి పై పోర్షన్ రాసిస్తానని, జీవనోపాధి కల్పిస్తానని మాయమాటలు చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఆమెకు న్యాయం జరిగేవరకు తాను అండగా ఉంటానన్నారు. బాధల్లో ఉన్న ఆమెను ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆమెకు డబ్బులు ముట్టినట్లు బాలాజీ చూపిస్తున్న పత్రాలు నమ్మదగ్గవిగా లేవన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment