![Police Constable Voilated Rules Of Lockdown In Tirumalagiri - Sakshi](/styles/webp/s3/article_images/2020/03/30/Police.jpg.webp?itok=r6PcN3XZ)
సాక్షి, తిరుమలగిరి (తుంగతుర్తి) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బాధ్యతగా ఉండాల్సిన ఓ పోలీస్ కానిస్టేబుల్ నిబంధనలు అతిక్రమించాడు. మాల్దీవుల నుంచి వచ్చిన ముగ్గురికి ఇంట్లో ఆశ్రయం కల్పించడమే కాకుండా వారితో బయట తిరిగి జల్సాలు చేశాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఆదివారం ఈ సంఘటన వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడేనికి చెందిన ప్రతాప్, నల్లగొండ జిల్లా కట్టంగూర్‌కు చెందిన ప్రదీప్, బి.హరీశ్‌లు మాల్దీవులలోని ఓ రిసార్ట్‌లో ఏడాదిన్నర కాలంగా వెయిటర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ నెల 21న హైదరాబాద్‌కు వచ్చారు. ఐదు రోజులు అక్కడే ఉండి అనంతరం ఈ నెల 26న తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న మాండ్ర శ్రీనివాస్ ఇంటికి వచ్చారు.
నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉండాల్సిన వారు, కానిస్టేబుల్ శ్రీనివాస్‌తో కలసి బయట తిరగడంతో పాటు జల్సాలు చేస్తున్నారని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆదివారం తహసీల్దార్ హరిశ్చంద్రప్రసాద్, సీఐ శ్రీనివాస్, వైద్యాధికారి ప్రశాంత్‌బాబు కానిస్టేబుల్ ఇంటికి వెళ్లగా శ్రీనివాస్ వారితో దురుసుగా ప్రవర్తించాడు. కాగా, వైద్య శాఖ సిబ్బంది.. మాల్దీవుల నుంచి వచ్చిన ముగ్గురితో పాటు కానిస్టేబుల్‌కు స్టాంపులు వేసి 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆదేశించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి వివరాలు తెలియజేయాలని వారు ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment