అమ్మకానికి ఆడపిల్లలు..? | Police custody In Father! | Sakshi
Sakshi News home page

అమ్మకానికి ఆడపిల్లలు..?

Published Wed, Sep 28 2016 12:43 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM

అమ్మకానికి ఆడపిల్లలు..? - Sakshi

అమ్మకానికి ఆడపిల్లలు..?

* పోలీసుల అదుపులో తండ్రి
* ఐసీడీఎస్‌కు బాలికల అప్పగింత

ఆదిలాబాద్ క్రైం: ఓ తండ్రి తన ఇద్దరు ఆడపిల్లలను అమ్మకానికి పెట్టాడనే అనుమానంతో పోలీసులు ఆ తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో పాటు బాలికలను ఐసీడీఎస్‌కు అప్పగించారు. ఈ ఉదంతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. మహారాష్ట్రలోని కిన్వట్‌కు చెందిన దశరథ్, శోభా దంపతులు కొంతకాలంగా ఆదిలాబాద్‌లోని కేఆర్‌కే కాలనీలో ఉంటూ కూలి పని చేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉండగా.. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 7వ, 5వ తరగతి చదువుతున్నారు.

మంగళవారం దశరథ్ తన ఇద్దరు కూతుళ్లతో కలసి పట్టణంలోని రైల్వేస్టేషన్‌లో రాజ స్తాన్‌కు చెందిన యువకుడు లతీఫ్‌తో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో అతని గ్రామానికే చెందిన రవికాంత్ అనే యువకుడు అక్కడికి వచ్చాడు. అదే సమయంలో పోలీసులు అక్కడికి రాగా, రవికాంత్ వెళ్లి దశరథ్ బాలికలను అమ్ముతున్నాడని చెప్పాడు. గతంలోనూ దశరథ్ ఇంకో కూతురిని విక్రయించాడని, తర్వాత ఇక్కడికి వచ్చి ఉంటున్నాడని పేర్కొన్నాడు. దీంతో పోలీసులు వారందరినీ టూటౌన్‌కు తరలించారు.

లతీఫ్ తనకు పాత పరిచయమని, మహాలక్ష్మీవాడ కాలనీలో ఉంటున్న బంధువుల వద్దకు రాగా రైల్వేస్టేషన్‌లో కలిశాడని దశరథ్ చెప్పాడు. తమ పిల్లలను ఎందుకు అమ్ముకుంటామని, అనవసరంగా తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై లతీఫ్‌తో ‘సాక్షి’ మాట్లాడగా.. తన బంధువుల ఇంటికి వచ్చానని, ఎప్పటి నుంచో దశరథ్‌తో పరిచయం ఉందని తెలిపాడు. ట్రాక్టర్ కొనుగోలు విషయమై రైల్వేస్టేషన్‌లో మాట్లాడాడని చెబుతున్నాడు. కాగా, తాను వెళ్లేసరికి విషయూన్ని పక్కదోవ పట్టించారంటూ రవికాంత్ తెలిపాడు. ఇద్దరు చిన్నారులను పోలీసులు ఐసీడీఎస్‌కు తరలించారు. వీరందరినీ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాతే అసలు విషయం బయటపడుతుందని, అప్పటి వరకు చిన్నారులు ఐసీడీఎస్‌లో ఉంటారని ఎస్సై రాజన్న వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement