ఆదిలాబాద్ క్రైం : మరికొద్ది గంటల్లో 2014కు బైబై చెప్పబోతున్నాం.. కొత్త సంవత్సరాన్ని స్వాగతించనున్నాం.. అయితే.. ఈ నయా జోష్‌లో యువత కొద్దిపాట దుందుడుకు స్వభావాన్ని వీడాలి. లేకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి వచ్చింది. నయా సాల్ వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
పార్టీలు చేసుకునేందుకు.. హంగామా సృష్టించేందుకు అందరూ సిద్ధమవుతున్నా వాటి పట్ల పలు నిబంధనలు పాటించాల్సిందే. పట్టణాలే కాకుండా.. పలె ్లల్లోనూ ఈ నిబంధనలు కొనసాగనున్నాయి. అర్ధరాత్రుల వరకూ తాగి ఊగకుండా తగిన సమయంలో ఇళ్లకు చేరుకుంటే ఎలాంటి ప్రమాదమూ ఉండదు. నిబంధనలు గానీ అతిక్రమిస్తే ఇక అంతే..!
అవాంఛనీయ ఘటనలపై నిఘా..
జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, భైంసా తదితర పట్టణాలే కాకుండా గ్రామాల్లోనూ న్యూ ఇయర్ వేడుకలు జోష్‌గా జరుపుకుంటుంటారు. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయా ప్రాంతాల్లో పోలీసు లు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే హోటళ్లు కూడా పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంది.
ఆయా వేడుకల్లో పాల్గొనే వారి జాబితాను తెలియజేయాల్సి ఉంటుంది. వేడుకలు చేసుకోవాలే తప్ప అతిగా ప్రవర్తించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి విధించారు. ఆ తర్వాత బహిరంగా ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవడానికి వీల్లేదని పోలీసులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ప్రముఖ హోటళ్లు, బార్లపై పోలీసులు ప్రత్యేక దృషి పెట్టారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని కోరుతున్నారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్..
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే, మందుబాబుల ఆగడాలపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నారు. పెట్రోలింగ్, గస్తీ కొనసాగించనున్నారు. రాత్రిళ్లో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిబంధనలు ఏర్పాటు చేయనున్నారు. వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఒకే చోట బహిరంగ ప్రాంతాల్లో గుంపులుగా ఉండకూడదని పేర్కొంటున్నారు. పోలీసులు ప్రధాన కూడళ్లలో రాత్రి 12 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. వాహనాల్లో ఎక్కువ మొత్తంలో మద్యం తరలించకూడదు.
పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం..
- తరుణ్ జోషి, ఎస్పీ
జిల్లాలో అన్ని పట్టణాల్లో రాత్రి పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. ప్రధాన కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. వేడుకలు నిర్వహించేందుకు ఇప్పటి వరకు ఏ హోటళ్లు అనుమతి తీసుకోలేదు. రాత్రి 11 గంటల తర్వాత మద్యం దుకాణాలు, బార్‌లు తెరిచి ఉండకూడదు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
నిబంధనలు ఇవీ..
నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించే హోటళ్లు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఆయా వేడుకల్లో పాల్గొనే వారి జాబితాను తెలియజేయాలి.
రాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలకు అనుమతి. ఆ తర్వాత బహిరంగా ప్రదేశాల్లో వేడుకలు జరుపుకోవద్దు.
వేడుకలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలి. ఒకే చోట బహిరంగా ప్రాంతాల్లో గుంపులుగా ఉండకూడ దు.
ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయకూడదు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు.
మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు. బహిరంగగా మద్యం సేవించరాదు. అతివేగంగా వాహనాలు నడుపకూడదు.
వాహనాల్లో ఎక్కువ మొత్తంలో మద్యం తరలించకూడదు.
రాత్రి 10 గంటలకు జిల్లాలోని అన్ని దుకాణాలు.. 11 గంటల వరకు బార్లు మూసివేయాలి. లేకుండా చర్యలు తప్పవు.
వేడుకల సమయంలో డీజే, లౌడ్‌స్పీకర్లకు అనుమతి లేదు.
ఎక్సైజ్ అనుమతి లేనిదే హోటళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో మద్యం విక్రయించకూడదు.
బాణాసంచా కాల్చడం నిషేధం.
మందు బాంబులు జాగ్రత్త
Published Tue, Dec 30 2014 11:36 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement