ప్రజాప్రతినిధులే టార్గెట్‌..! | Police Department Confusion about Maoist Activities | Sakshi
Sakshi News home page

ప్రజాప్రతినిధులే టార్గెట్‌..!

Published Fri, Nov 9 2018 1:18 AM | Last Updated on Fri, Nov 9 2018 1:18 AM

Police Department Confusion about Maoist Activities - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల వేళ మావోయిస్టు హెచ్చరికలు పోలీస్‌ శాఖను కలవరంలో పడేసేలా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ వచ్చిన మావోయిస్టు 
పార్టీ ఇప్పుడు తాజాగా ప్రజాప్రతినిధులను టార్గెట్‌ చేస్తూ లేఖ విడుదల చేయడం సంచలనానికి తెరదీసింది. గురువారం ఉదయం బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను హెచ్చరిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేయడం గోదావరి పరీవాహక ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు సాగుతున్నాయనడానికి నిదర్శనమని అంటున్నారు.  

కదలికలు నిజమేనా? 
ఇన్నాళ్లూ మావోయిస్టు పార్టీ తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోనే కార్యకలాపాలను సాగిస్తూ వస్తోంది. అయితే కొద్దిరోజుల నుంచి వాజేడు వెంకటాపురం, భద్రాచలం పరిసరాలతో పాటు భూపాలపల్లి, మంథనిలో డివిజన్‌ కమిటీల కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దఫాలో ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా 15 రోజుల నుంచి కాల్పులు, ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం రక్తసిక్తమవుతోంది. తీరా ఇప్పుడు తెలంగాణలోనూ పేలుళ్లకు మావోయిస్టు పార్టీ కుట్రపన్ని ఉంటుందా అన్న కోణంలో పోలీస్‌ ఉన్నతాధికారులు కూంబింగ్‌ను వేగవంతం చేశారు. వాజేడులో వెలిసిన పోస్టర్ల కింద ల్యాండ్‌మైన్లు అమర్చడం చూస్తే భారీ స్థాయిలో విధ్వంసానికి పాల్పడేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సమయంలో మావోయిస్టు పార్టీ చర్యలు గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని 10 నుంచి 12 నియోజకవర్గాల్లో తీవ్రమైన భయాందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ కార్యకలాపాలు మొత్తం రాష్ట్ర కమిటీ కీలక నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పెద్దగా కార్యకలాపాలు సాగించని డివిజన్‌ కమిటీలు ఎన్నికల సమయంలో యాక్టివ్‌ అవడం పోలీసులను ఒత్తిడిలోకి నెడుతోంది. రాష్ట్ర కమిటీ కింద పనిచేస్తున్న శబరి కమిటీ మాత్రమే కొంత యాక్టివ్‌గా ఉందని భావించిన నిఘా వర్గాలు ఇప్పుడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యేకు వార్నింగ్‌ ఇస్తూ ఇచ్చిన లేఖ పోలీస్‌ అధికారులనే షాక్‌కు గురిచేసినట్టు తెలిసింది. అయితే ఏడాదిన్నర క్రితం ఆదిలాబాద్‌ డివిజన్‌ కార్యదర్శి చార్లెస్‌ అలియాస్‌ డేవిడ్‌ మహారాష్ట్రలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. ఇతడి స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి ఇప్పుడు మంచిర్యాల డివిజన్‌ కమిటీని లీడ్‌చేయడంతోపాటు దాడులకు కూడా వ్యూహరచన చేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు డివిజన్‌ కమిటీ కార్యకలాపాలు లేవని భావించిన నిఘా వర్గాలు.. ఇప్పుడు విడుదల చేసిన లేఖతో కంగుతిన్నట్టు తెలిసింది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మావోయిస్టు పార్టీ క్షేత్ర స్థాయిలో రిక్రూట్‌మెంట్‌ కూడా చేసే ఆలోచన చేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఆ లేఖపై అనుమానం... 
మావోయిస్టు పార్టీ మంచిర్యాల డివిజన్‌ కమిటీ పేరుతో మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ఇచ్చిన లేఖపై అటు స్థానిక పోలీసులు, ఇటు స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) విచారణ సాగిస్తున్నారు. సాధారణంగా మావోయిస్టుల పోస్టర్లు, లేఖలు సిద్ధాంతంతో కూడిన పదాలతో ప్రారంభమవుతాయి, అయితే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ ఇచ్చిన లేఖ వీటికి భిన్నంగా ఉండటం అనుమానాలకు తావిస్తోందని నిఘా అధికారులు స్పష్టంచేశారు. పైగా ఏ4సైజ్‌ పేపర్‌పై రాసి ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోందని నిఘా అధికారి ఒకరు స్పష్టం చేశారు. కావాలనే ఎవరైనా రాశారా లేక నిజంగా డివిజన్‌ కమిటీ నుంచి వచ్చిందా అన్నది రెండురోజుల్లో తెలుస్తుందని వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement