ఆక్రమించిన ‘డబుల్‌’ ఇళ్లు ఖాళీ  | Police Evacuated Double Bed Room Invaders In Khammam | Sakshi
Sakshi News home page

ఆక్రమించిన ‘డబుల్‌’ ఇళ్లు ఖాళీ 

Published Thu, Aug 8 2019 1:17 PM | Last Updated on Thu, Aug 8 2019 1:18 PM

Police Evacuated Double Bed Room Invaders In Khammam - Sakshi

ఆక్రమణదారులతో మాట్లాడుతున్న డీఆర్‌ఓ శిరీష

సాక్షి, ఖమ్మం : మండల పరిధిలోని ముసలిమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అక్రమంగా ప్రవేశించిన వారిని అధికారులు బుధవారం ఖాళీ చేయించారు. గ్రామంలో నిర్మాణం పూర్తయిన 20 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలోకి గత ఆదివారం రాత్రి కొందరు అక్రమంగా ప్రవేశించారు. ఇళ్లకు వేసిన తాళాలు పగుల గొట్టి సామగ్రి సర్దుకున్నారు. విషయం తెలిసిన తహసీల్దార్‌ జన్ను సంజీవ గ్రామానికి చేరుకుని ఇళ్లను ఖాళీ చేయాలని సూచించారు. ఆక్రమణదారులు ఖాళీ చేయకపోవడంతో తహసీల్దార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ను స్వయంగా కలిసి పరిస్థితి వివరించారు. దీంతో కలెక్టర్‌ పోలీసు ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి ఆక్రమణదారులను ఖాళీ చేయించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ ఆదేశాల మేరకు ఇళ్లను ఆక్రమించుకున్న 20 మంది వ్యక్తులపై మంగళవారం రాత్రి వైరా పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్దకు రెవెన్యూ అధికారులు పోలీసులను తీసుకుని వెళ్లారు.

డీఆర్వో శిరీష, తహసీల్దార్‌ సంజీవ, డీసీపీ దాసరి ప్రసన్నకుమార్, సీఐ రమాకాంత్, ఎస్సైలు తాండ్ర నరేష్, శ్రీనివాస్, ఎల్లయ్య, సుమారు 100 మంది పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఇళ్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులను హెచ్చరించారు. ఖాళీ చేయబోమంటూ ఆక్రమణదారులు ఆందోళనకు దిగారు. తమకు ఇళ్లు ఇస్తామంటేనే గతంలో ఇక్కడ ఉన్న 35 గుడిసెలు తొలగించామని, ఇప్పుడు తమకు ఇళ్లు ఇవ్వకపోతే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుంది.  ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. అర్హులకు ఇళ్లు అందేవిధంగా చర్యలు తీసుకుంటామని అధికారులు నచ్చజెప్పి ఇళ్లను ఖాళీ చేయించారు. అనంతరం తాళాలు వేసి సీల్‌ వేశారు. కాగా కొందరు డీఆర్‌ఓ శిరీష కాళ్ల మీద పడి కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అర్హులకు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. దీంతో మూడు రోజుల నుంచి ఉత్కంఠ రేపుతున్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల ఆక్రమణ వివాదం సద్దుమణిగింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement