ఎన్నిక వేళ మావోయిస్టుల అలజడి
భద్రతను పెంచిన పోలీసులు
భూపాలపల్లిపై ప్రత్యేక దృష్టి
హన్మకొండ: వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా పోలీసులతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలు, పారామిలిటరీ, ఇతర జిల్లాలకు చెందిన పోలీసులను ఎన్నికల విధుల కోసం రప్పించారు. మొత్తంగా 7,606 మంది పోలీసులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యూరు. ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోయిస్టులు పిలుపునివ్వడంతో అటవీ ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు. తెలంగాణలో తొలి ఎన్‌కౌంటర్ తాడ్వాయి అడవుల్లో జరిగిన రెండు నెలల వ్యవధిలోనే ఉప ఎన్నికలు వచ్చాయి. అంతకుముందే భూపాలపల్లి నియోజకవర్గంలో అధికార పార్టీకి చెందిన రాజకీయ నేతలపై మావోయిస్టుల హెచ్చరిక పోస్టర్లు వెలిశాయి. తాజాగా వరంగల్ ఉప ఎన్నికను బహిష్కరించాలంటూ భారత క మ్యూనిస్టు మావోయిస్టు పార్టీ దం డకారణ్యం కార్యదర్శి జగన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దులో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న భూపాలపల్లి నియోజకర్గంలో పోలింగ్ ప్రక్రియపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పోలీసు యంత్రాంగం సైతం ఇక్కడ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. భూపాలపల్లి అటవీ ప్రాం తంలో శుక్రవారం నార్త్‌జోన్ ఐజీ నవీన్‌చంద్ పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఒక్క భూపాలపల్లి ఏరియాలోనే ఇద్దరు ఏఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, 18మంది సీఐలు, 90 మంది ఎస్సైలతో పాటు రెండు వేల మంది కి పైగా పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గురు, శుక్రవారాల్లో గ్రేహౌండ్స్ బలగాలు అటవీప్రాంతంలో ముమ్మరంగా కూం బింగ్ నిర్వహించాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అన్ని పోలీసుస్టేషన్లను పోలీస్ కమిషనర సుధీర్‌బాబు సందర్శించారు. పోలింగ్ సజావుగా జరిగేందుకు తీసుకోవాల్సిన జాగ్రతలపై సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక వరంగల్ రూరల్ పరిధిలో ఏటూరునాగారం, భూపాలపల్లి, పరకాల, కురవి, దంతాలపల్లి, మరిపెడ, మొండ్రాయి, పెంబర్తి, చేర్యాలలో చెక్‌పోస్టులు ఏర్పాటుచేశారు. ఇక్కడి తనిఖీల్లో రూ. 77,13, 950 నగదును పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారన్న అనుమానం ఉన్న 2,540 మందిని తహశీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. వరంగల్ రూరల్ పరిధిలో 791 పోలింగ్ కేంద్రా లు ఉండగా వీటిలో 269 అతి సున్నిత, 274 సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో అతి సున్నిత పోలింగ్ కేం ద్రాలు 70, సున్నితమైనవి 200 ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ శాఖా పరంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు ఐదు చెక్‌పోస్టుల ద్వారా రూ.1,88,48,847 నగదు సీజ్ చేసి 5035 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. నగదు, మద్యం రవాణాపై 864 కేసులు నమోదు చేశారు. 196 బెల్టుషాపులను మూయించారు. శాంతిభద్రతల దృష్ట్యా ఇప్పటి వరకు 736 మందిని అరెస్టు చేశారు.
వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛ గా ఓటు హక్కు వినియోగించుకునేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వరంగల్ రూరల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా శక్రవారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించినా, డబ్బు, మద్యం పం పిణీ చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ ఒక్కరు ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలన్నారు. పోలింగ్ స్టేషన్లకు ఓటర్లను, ఇతరులను తీసుకురావడం చేయొద్దని, పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో ప్రజలు గుమిగూడడం వంటివి చేయొద్దని ఎస్పీ సూచించారు.
ఖాకీల అలర్ట్
Published Sat, Nov 21 2015 1:10 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement