సాక్షి, సిటీబ్యూరో: దాదాపు రెండు నెలలుగా తీసుకున్న చర్యలు, పోలీసుల వ్యూహం ఫలించాయి. ఫలితంగా శుక్రవారం చిన్న ఘటనకూడా చోటు చేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) నుంచి ఉన్నతాధికారులు పరిస్థితులను ఆధ్యంతం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. నగర కొత్వాల్ అంజనీ కుమార్‌తో పాటు ప్రత్యేకాధికారిగా వచ్చిన ఐజీ మల్లారెడ్డి సైతం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజు వేయడంతో పాటు డీజీపీ కార్యాలయంతో సమన్వయం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లారు. గత ఎన్నికల నేపథ్యంలో సిటీలో మొత్తం 24 కేసులు నమోదు కాగా... ఈసారి ఒక్కటీ రికార్డులకు ఎక్కలేదు.
మూడు విభాగాలుగా విభజించి...
ఎన్నికల నోటిషికేషన్ వెలువడినప్పటి నుంచి రంగంలోకి దిగిన సిటీ ఎలక్షన్ సెల్ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. ఫలితంగా నగరంలోని ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? పోటీ చేసే అభ్యర్థులు, వారి వివరాలు, అనుచరుల కదలికలు తదితర అంశాలను పక్కాగా బేరీజు వేయగలిగింది. నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందించిన సమాచారం చాలా కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసు విభాగం అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించగలిగారు. ఫలితంగా నాలుగు నియోజకవర్గాలతో పాటు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాలను ఈ కేటగిరీల్లోకి తీసుకువచ్చారు. దీని ఆధారంగా బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు.
షాడో పార్టీల సమాచారం కీలకం...
దాదాపు ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి నగర పోలీసులు షాడో టీమ్స్‌ను రంగంలోకి దింపారు. దాదాపు 24 గంటలూ విధులు నిర్వర్తించిన ఈ బృందాలు ఎప్పటికప్పుడు వారి కదలికలను కనిపెట్టి సమాచారం అందిస్తూ వచ్చాయి. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. పోలింగ్ రోజున కూడా దాదాపు 100 పార్టీలు విధుల్లో ఉన్నాయి. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. మరోపక్క రెండు నెలలుగా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులకు కౌన్సిలింగ్, బైండోవర్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దృష్టి పెట్టారు. నగరం బయట, అజ్ఞాతంలో ఉన్న వారి వల్లా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా పోలింగ్ రోజున కనీసం ఒక్క అవాంఛనీయ ఘటన కూడా నమోదు కాలేదు.
3–5 మధ్య ప్రత్యేక చర్యలు...
పోలింగ్ రోజు చివరి రెండు గంటలు (మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 మధ్య) సమయం అత్యంత కీలకం.
ఈ వేళల్లోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పాతబస్తీలోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి 3 గంటల వరకు ఓటింగ్‌కు రాని వారి వివరాలు సేకరించే కొన్ని పక్షాలు వారి పేర్లతో వేరే వారిని పంపి దొంగ ఓట్లు వేయించడానికి ప్రయత్నిస్తుంటారు. దీనిని అడ్డుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నాలు చేయడం ఘర్షణలు, గొడవలకు దారి తీస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసు విభాగం ‘ఆ రెండు’ గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్‌లో ఉన్న బలగాలను సైతం ఏరియాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ పూర్తి చేయగలిగింది.
ఎంట్రీల వద్ద కేంద్ర బలగాలే...
కేంద్ర ఎన్నికల సంఘం గతానికి భిన్నంగా ఈసారి పోలింగ్ బూత్‌ల బాధ్యతలను కేంద్ర సాయుధ బలగాలకు అప్పగించారు. స్థానికంగా పని చేసే పోలీసు అధికారులు ఫలానా వ్యక్తి గెలుస్తాడనో, ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతో పరోక్షంగా వారికి సహకరించే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమయాయి. దీనికి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయడం కోసం ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేసిన విధానాన్నే ఇక్కడా ప్రయోగించింది. అక్కడ నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా వ్యవహరించే స్థానిక పోలీసుస్టేషన్ ఇన్‌చార్జ్ (జిల్లాల్లో ఎస్సై, కమిషనరేట్లలో ఇన్‌స్పెక్టర్)లతో పాటు పోలీసు సిబ్బందికి బూత్‌ల బాధ్యతలు అప్పగించలేదు. అక్కడి భద్రత, బందోబస్తులను కేంద్ర బలగాలకు అప్పగించింది. ఇదే వి«ధానాన్ని ఇక్కడా అమలు చేస్తూ ఎస్‌ఎస్‌బీ బలగాలను పోలింగ్ బూత్ ఎంట్రన్స్‌ల వద్ద మోహరించింది.
Comments
Please login to add a commentAdd a comment