సమావేశంలో మాట్లాడుతున్న రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేష్ భగవత్, సజ్జనార్
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు తెలిపారు. బుధవారం మొత్తం 24 నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తుపై వారు మాట్లాడారు. హైదరాబాద్ పరిధిలో భద్రతా విధుల్లో 17,845 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఏసీపీ స్థాయి అధికారి నోడల్ ఆఫీసర్‌గా ఉంటారన్నారు. రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 24 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్,
సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. – సెంటర్‌స్ప్రెడ్‌లో
♦ 15 నియోజకవర్గాలు పూర్తిగా, మరో 4 పాక్షికంగా సిటీ పరిధిలో ఉన్నాయి. ప్రతి నియోజకవర్గానికీ ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
♦ నగరంలో మొత్తం 1,574 ప్రాంతాల్లో 3,911 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 161 ప్రాంతాలు అత్యంత సున్నిత, 334 సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. 21 ప్రాంతాల్లోని 17 పోలింగ్ స్టేషన్లు అత్యంత సమస్యాత్మకమైనవిగా ఉన్నాయి. వీటన్నింటిని కవర్ చేస్తూ 426 పోలీస్ రూట్లు ఏర్పాటు చేశారు.
♦ పటిష్ట నిఘా కోసం ఒక్కో నియోజకవర్గంలో మూడు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, మరో మూడు ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దింపారు. పరిస్థితుల్ని బట్టి ఏ ప్రాంతానికైనా చేరుకోవడానికి వీలుగా 60 క్విక్ రెస్పాన్స్ టీమ్స్, 17 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ల్ని సిద్ధం చేస్తున్నారు. నగర సరిహద్దుల్లో 12 ఇంటర్ బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
♦ పోలింగ్ రోజున నిర్ణీత ప్రదేశాల్లో 51 చెక్ పోస్టులు, 302 శాంతిభద్రతల విభాగం పికెట్లు పని చేయనున్నాయి. వీటితో పాటు ట్రాఫిక్, సాధారణ పోలీసులతో ఉమ్మడిగా 93 ఇంటర్‌సెప్షన్ టీమ్స్ పని చేయనున్నాయి. 518 చెక్ పాయింట్లనూ ఏర్పాటు చేస్తున్నారు. సమాచార మార్పిడి కోసం 3300 వాకీటాకీలు అందిస్తున్నారు. నగరంలోని 15 డీఆర్సీ సెంటర్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
♦ ఇప్పటి వరకు నగరంలో రూ.22.03 కోట్ల నగదు, రూ.2.41 కోట్ల విలువైన బంగారం/వెండి, రూ.1.28 కోట్ల విలువైన ఇతర వస్తువులు, రూ.2.91 లక్షలు విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. 4220 మందిని బైండోవర్ చేయగా, 13,584 పెట్టీ కేసులు నమోదు చేశారు. 2957 నాన్– బెయిలబుల్ వారెంట్లను ఎగ్జిక్యూట్ చేశారు. 4586 మంది తమ లైసెన్డ్ ఆయుధాలను డిపాజిట్ చేయగా.. 150 కోడ్ వాయిలేషన్, 9 పోల్ వాయిలేషన్ కేసులు నమోదయ్యాయి.
♦ నగర పోలీసు విభాగంలో ఉన్న 14,645 మందితో పాటు కేంద్ర బలగాలకు చెందిన 2,200 మంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 1000 మంది సహా మొత్తం 17,845 మంది బందోబస్తు విధుల్లో ఉంటున్నారు.
వీటిపై జాగ్రత్తసుమా..
సిటీలో ఎక్కడా బయటి ప్రాంతాలకు చెందిన వారు కారణం లేకుండా ఉండకూడదు. వీరిని గుర్తించడానికి బుధ, గురువారాల్లో లాడ్జిలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లల్లో సోదాలు చేస్తారు. ఇలాంటివారిని స్థానికులు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలోకి గన్‌మెన్లు, వాహనాలను అనుమతించరు. 200 మీటర్ల వరకు కేవలం అభ్యర్థి వాహనం, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ వాహనం, గరిష్టంగా ఐదుగురితో కూడిన వర్కర్ల వాహనాన్ని మాత్రమే అనుమతిస్తారు. వీరికి జారీ చేసిన పర్మిట్‌ను వాహనం ముందు భాగంలో, ఎడమ వైపున స్పష్టంగా కనిపించేలా అతికించాలి. నిర్దేశిత ప్రాంతంలోకి వాటర్ ట్యాంకర్లు, పాల వ్యాన్లు తదితర అత్యవసర సేవలకు చెందిన వాహనాలు మినహా మరే ఇతర వాటినీ అనుమతించరు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఎలక్షన్ బూత్ ఏర్పాటు చేసుకోవడానికి 200 మీటర్ల అవతలే అనుమతి. ఇక్కడ షామియానాలు వేయకూడదు. ఆయా పార్టీలు, అభ్యర్థులకు చెందిన అధీకృత వ్యక్తులు కేవలం ఒక టేబుల్, రెండు కుర్చీలు మాత్రమే
వేసుకోవాలి. ఓటర్లను రవాణా చేస్తూ చిక్కిన కమర్షియల్ వాహనాలను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తారు.
సైబరాబాద్, రాచకొండ పరిధిలో
♦ ఎన్నికల విధుల్లో 24 వేల మంది సిబ్బంది
♦ డైనమిక్ చెక్‌పోస్టులతో నగదు, మద్యం నియంత్రణకు చర్యలు
♦ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రీజినల్ స్ట్రాటజిక్‌తో ప్రత్యేక నిఘా
♦ ప్రలోభాలకు గురిచేస్తే 94906 17111, 94906 17444 లకు ఫిర్యాదు చేయొచ్చు
♦ రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు మహేష్ భగవత్, వీసీ సజ్జనార్
రాచకొండ, సైబరాబాద్, కమిషనరేట్ల పరిధిలో 24వేల మంది బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్నారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. మద్యం, డబ్బులతో ప్రలోభానికి గురిచేస్తే రాచకొండ వాట్సాప్ నంబర్ 949061 7111కు, సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 94906 17444కు సమాచారం అందించాలని వారు సూచించారు. ఎన్నికల ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామనే భావనను ఓటర్లలో తీసుకొచ్చేందుకు 80 ఫ్లాగ్‌మార్చ్‌లతో పాటు కార్డన్ సెర్చ్ చేశామన్నారు. ఎన్నికల ప్రచారం కోసం బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. డైనమిక్ చెక్ పోస్టులతో నగదు, మద్యం నియంత్రిస్తున్నామన్నారు.
రాచకొండలో..
♦ ప్రతి నియోజకవర్గానికీ ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
♦ రాచకొండ కమిషనరేట్‌లో 517 అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. వీటి పరిధిలో ప్రత్యేకంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు మైక్రో అబ్జర్వర్లు, వెబ్ కాస్టింగ్, వీడియో సర్వలైన్స్‌లు ఏర్పాటుచేశారు.
♦ ఆయా నియోజకవర్గాల్లో 263 మొబైల్ రూట్స్, 27 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, మరో 27 ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దింపారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల సరిహద్దుల్లో 11 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
సైబరాబాద్‌లో..
♦ ప్రతి నియోజకవర్గానికీ ఏసీపీ స్థాయి అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. వీరు ఇతర విభాగాల సమన్వంతో ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితుల్ని బేరీజు వేస్తూ నివేదికలు రూపొందిస్తున్నారు.
♦ సైబరాబాద్ కమిషనరేట్‌లో 152 ప్రాంతాలు అత్యంత సున్నిత ప్రాంతాలుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా పదివేల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల రోజున స్పెషల్ వీడియో గ్రాఫర్స్ సేవలు తీసుకుంటారు.
♦ పటిష్ట నిఘా కోసం ఆయా నియోజకవర్గాల్లో 237 మొబైల్ రూట్స్, 21 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, మరో 21 ఫ్లయింగ్ స్క్వాడ్స్‌ను రంగంలోకి దింపారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల సరిహద్దుల్లో 26 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
♦ పోలీసు విభాగంలో ఉన్న 6 వేల మందితో పాటు మరో 3 వేల మంది చెన్నై, కర్ణాటక, ఒడిశా పోలీసులు, తెలంగాణ రాష్ట్రం నుంచే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన 1000 మంది, కేంద్ర బలగాలకు చెందిన 20 కంపెనీలతో సహా మొత్తం 12,000 మంది బందోబస్తు విధుల్లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment