రేవ్ పార్టీ గుట్టురట్టు
పట్టుబడిన 14 మంది యువకులు, 12 మంది యువతులు
శామీర్‌పేట: పౌల్ట్రీఫాంలో గుట్టుగా జరుగుతున్న రేవ్‌పార్టీని పోలీసులు రట్టు చేశారు. శనివారం అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు చేస్తున్న 12 మంది యువతులతో పాటు 14 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం తుర్కపల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ బాబ్జీ కథనం ప్రకారం.. తుర్కపల్లి నివాసి చిన్నరాజిరెడ్డికి చెందిన వినియోగంలో లేని పౌల్ట్రీఫాంలో పోలీసులు దాడులు నిర్వహించారు.
ఓ హాలులోని రెండు గదుల్లో 12 మంది యువతులు మత్తులో అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తున్నారు. వారిపై 14 మంది యువకులు నోట్లు వెదజల్లుతున్నారు. పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. రూ. 2.98 లక్షల నగదు, రెండు ఇన్నోవాలు, ఒక టవేరా వాహనంతోపాటు ఓ ఇండికా కారు, 19 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన యువతుల్లో ముగ్గురు ముంబై, ఒకరు కోల్‌కతా, మిగిలిన వారు నగరానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. యువకులంతా నగర శివారులోని పలు ప్రాంతాలకు చెందిన వారే.