ఆశా వర్కర్ల పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు
ఆలేరు: ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వరంగల్ జిల్లా పాలకుర్తి నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వరకు చేపట్టిన మహాపాదయాత్రను నల్లగొండ జిల్లా ఆలేరులో పోలీసులు అడ్డుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాదయాత్ర ఆలేరుకు చేరుకుంది. భోజనాలు చేసిన అనంతరం ఆశావర్కర్లు, సీపీఎం నాయకులు సాయంత్రం సమయంలో గుండ్లగూడెం నుంచి ఆలేరు వైపునకు పాదయాత్ర ద్వారా తరలివెళ్తుండగా.. పెద్దవాగుపై పలువురు సీపీఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆశావర్కర్లు బస్టాండ్ వద్దకు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో యాదగిరిగుట్ట సీఐ రఘువీర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆశావర్కర్లను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రాస్తారోకోలో పోలీసులు, ఆశావర్కర్లకు మధ్యతోపులాట జరిగింది. ఈక్రమంలో ఇద్దరు ఆశాకార్యకర్తలు గాయపడితే వారి ని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. డీఐజీ అనుమతి తీసుకుని మహాపాదయాత్ర చేపట్టామని అయినా పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ఫోన్‌లో విలేకరులతో మాట్లాడారు. అరెస్ట్‌అయినవారిలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్‌రావు, బొట్ల చక్రపాణి, సరాంపల్లి వాసుదేవ్‌రెడ్డి, మంగ నర్సింహులు, జూకంటి పౌల్, రజిత, ఎక్బాల్ ఉన్నారు.