చికిత్స పొందుతున్న మన్యానాయక్
ఖమ్మంఅర్బన్ : పోలీసులు శాంతి భద్రతలను కాపాడటమే కాదు నిండు ప్రాణాలను సైతం కాపాడుతారని నిరూపించారు రఘునాథపాలెం పోలీసు స్టేషన్‌లోని ఇద్దరు పోలీసులు. గుండె పోటుతో కొట్టుకుంటున్న ఓ రియల్ వ్యాపారికి ప్రాణ బిక్ష ఔదార్యాన్ని చాటారు. రియల్ వ్యాపారి కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని రఘునాథపాలెం బైపాస్‌లోని ప్రగతి ఫ్రైడ్ గృహ సముదాయంలో బాదావత్ మన్యానాయక్ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.
మంగళవారం ఉదయం 8 గం.ల సమయంలో 100 కాల్‌కు గన్యానాయక్ భార్య ఫోన్ చేసి తన భర్తకు గుండె పోటు వచ్చి పడిపోయాడని, ప్రాణాపాయం ఉందని చెప్పింది. డ్యూటీలో ఉన్న బ్లూ కోర్టు కానిస్టేబుల్ జర్పల సురేష్, హెడ్ కానిస్టేబుల్ బి. వెంకటేశ్వర్లు వెంటనే తమ ద్విచక్ర వాహనంపై కాల్ వచ్చిన నివాసానికి క్షణాల్లో వెళ్లారు. అప్పటికే మన్యానాయక్ గుండె పోటు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్నాడు.
అక్కడ భార్య ఒక్కతే ఉంది. భర్తను పట్టుకొని రోదిస్తుంది.
వెంటనే ఆ ఇద్దరు పోలీసులు తమకు తట్టిన ఆలోచనతో చాతిపై వత్తిడి చేసి ఊపిరి పీల్చుకొనే విధంగా ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్న కారులో మన్యానాయక్‌ను ఎక్కించుకుని కానిస్టేబులే డ్రైవింగ్ చేసుకుంటూ ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే డాక్టర్‌లు వైద్యం అందించారు. ఆసుపత్రికి సకాలంలో తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.
తన భర్త ప్రాణాలు కాపాడటంలో దేవుడే ఆ ఇద్దరు పోలీసులను పంపించాడని, వారి సహాయాన్ని జీవితంలో మర్చిపోలేనని రోదిస్తూ పేర్కొంది. ఇద్దరు పోలీసులను వైద్యులు, తోటి పోలీసులు, మండల వాసులు అభినందించారు. పోలీసులు శాంతి భద్రతల రక్షణే కాదు.. సమయానుకూలంగా సమాజ సేవలోనూ తమవంతు కృషి చేస్తారని నిరూపించారు. నిండు ప్రాణం కాపాడినందుకు వారికి హ్యాట్యాఫ్.
Comments
Please login to add a commentAdd a comment