అల్గునూర్(కరీంనగర్): ఖాకీ అంటే కర్కషత్వం అనుకుంటారు. పోలీసులకు దయ, జాలి ఉండవని అంటారు. ఆడ్రెస్ వేసుకుంటే తన, మన ఉండదంటారు, వాళ్లకు హృదయం లేదంటుంటారు. కానీ పోలీసులందు ఈపోలీసు వేరయా అన్నట్లు ఓ పోలీసు అధికారి తన ఔన్నత్యం, దయాగుణాన్ని చాటుకున్నాడు. అయిన వాళ్లందరూ ఉండి, ఒంటరిగా ఉన్న అవ్వకు గూడు కట్టించాడు ఓ సబ్‌ఇన్సెపెక్టర్. వివరాల్లోకి వెళ్తే తిమ్మాపూర్ మండలంలోని మాల్లాపూర్ గ్రామానికి చెందిన కండె ఎల్లవ్వ(65)కు ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంతానం. భర్త, కొడుకు మృతిచెందడంతో ఎల్లవ్వే కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. కూలినాలి చేసుకుంటూ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. చిన్న పూరి గుడిసెలో ఉంటోంది. సిమెంటు ఇటుకలు, ఇతర సామగ్రి తెప్పించుకున్నా నిర్మించుకునే స్థోమత లేక ఇటుకలు పేర్చి దానిపై ఫ్లెక్సీని కప్పుగా వేసుకుని ఉంటోంది.
ఇటీవల స్థానిక ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మల్లాపూర్ పర్యటనకు వెళ్లినప్పుడు వృద్ధురాలు తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె దీనస్థితిని చూసి ఆయన చలించి అక్కడే ఉన్న ఎస్సైని పిలిచి అవ్వకు వెంటనే ఇల్లు కట్టించి నీడ కల్పించాలని సూచించారు. ఈ మేరకు ఎస్సై కృష్ణారెడ్డి రూ.50 వేలు తన సొంత ఖర్చుతో ఇంటి నిర్మాణం ప్రారంభించారు. వారం రోజుల్లో నిర్మాణం పూర్తి చేయించారు. స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి కూడా నిర్మించారు. దీంతో ఒంటరి అవ్వకు గూడు దొరికింది. ఎల్లవ్వ ఇంటి ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యేను ఆహ్వానిస్తామని ఎస్సై తెలిపారు. నిర్మాణం పూర్తవడంతో వృద్ధురాలి మోములో ఆనందం వెల్లివిరిసింది. ఆమె కళ్లలో ఆనందభాష్పాలు చూసి తన మనసు ఉప్పొంగిందని, వృద్ధురాలికి ఇల్లు కట్టించడంతో ఆత్మసంతృప్తి కలిగిందని ఎస్సై అన్నారు. కాగా, ఒంటి దాన్ని అయిన తన గోడు విన్న ఎమ్మెల్యే, తనకు గూడు కట్టి నీడ కల్పించిన ఎస్సై కృష్ణారెడ్డిల మేలును ఎన్నటికీ మరువ అని ఎల్లవ్వ అన్నది. తన సొంత ఇంటి కల ఇన్నేళ్లకు నెరవేరిందని ఆనందం వ్యక్తం చేసింది.
వృద్ధురాలికి గూడు కట్టించిన ఎస్సై
Published Mon, Apr 10 2017 8:06 PM | Last Updated on Sun, Sep 2 2018 5:06 PM
Advertisement
Advertisement