సాక్షిప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో రాజకీయాలు గంటగంటకు మారుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ స్కెచ్‌లో భాగంగా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్‌రెడ్డే లక్ష్యంగా వ్యూహ, ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన రేవంత్ కొడంగల్‌లోని తన నివాసంలో ఆదివారం నియోజకవర్గ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలోని కోస్గి, మద్దూరు మండలాల నుంచి కొద్దిమంది నేతలు వెళ్లగా.. మరికొందరు డుమ్మా కొట్టారు. ఓ వైపు రేవంత్ తన అనుచరులతో మంతనాలు జరుపుతుండగా.. మరోవైపు నియోజకవర్గంలోని మరికొందరు ‘కారు’ ఎక్కేశారు.
సీఎం కేసీఆర్‌పై విమర్శలు ఎక్కుపెడుతున్న రేవంత్‌ను నియోజకవర్గంలో బలహీనం చేసేందుకు టీఆర్‌ఎస్ నేతలు భారీ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే మద్దూరు, దౌల్తాబాద్, కొడంగల్ వంటి మండలాల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరగా.. ఆదివారం కూడా మద్దూరు మండలానికి కొందరు నేతలు మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో గులాబీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు రేవంత్ వెంట జిల్లా స్థాయి నేతలు కూడా వెళ్లకుండా ఎక్కడిక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో టీడీపీకి చెందిన నేత ఒక్కరూ కూడా రాజీనామా చేసిన దాఖలాలు లేవు. ఇక సోమవారం రేవంత్ హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి ఎవరెవరు వెళ్తారనేది తేలాల్సి ఉంది.
ఆట మొదలైందన్న రేవంత్..
కొడంగల్‌లోని తన నివాసంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో రేవంత్ ఉద్వేగభరితంగా మాట్లాడారు. రెండు సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలను వదిలి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు కొడంగల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాను మృతి చెందాకే సమాధి కూడా ఇక్కడే నిర్మిస్తారని ఉద్వేగంగా మాట్లాడారు. కొడంగల్ దొరల కోటలను కూల్చినట్టుగానే కేసీఆర్ గోడలను కూల్చుతానని స్పష్టం చేశారు. కొడంగల్ నుంచి రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
అలాగే నియోజకవర్గం నుంచి నేతలు పార్టీ మారడంపై కూడా స్పందించారు. అధికార పార్టీ నేతలు తమ కార్యకర్తలను పార్టీలో చేర్చుకునేందుకు డబ్బు మూటలు పట్టుకొని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. కొందరు సన్నాసులు పార్టీ మారినా నిజమైన కార్యకర్తలు తన వెంటే ఉన్నారని పేర్కొన్నారు. ‘ఇప్పుడే నిజమైన ఆట మొదలైంది..’ అని రేవంత్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించే సమావేశానికి కేసీఆర్ వ్యతిరేకులందరూ హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
సమావేశానికి తమ్ముళ్ల డుమ్మా..
కొడంగల్‌లో నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి జిల్లా లోని కోస్గి, మద్దూరు మండలాలకు చెందిన నేతలు చాలా వరకు డుమ్మా కొట్టారు. ఫలితంగా నియోజకవర్గం మొత్తంలో టీడీపీకి.. ముఖ్యంగా రేవం త్ అత్యంత బలంగా పేరొందిన కోస్గి లో కూడా పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఎంపీపీ నాగులపల్లి ప్రతాప్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దోమ రాజేశ్వర్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డీ.కే.రాములుతోపాటు సీనియర్ నాయకులు రేవంత్ సమావేశానికి దూరంగా ఉన్నారు. కోస్గి మండల అధ్యక్షుడు రా ఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి బెజ్జు రాములుతో పాటు గుండుమాల్, ము దిరెడ్డిపల్లి, పోతిరెడ్డిపల్లికి చెందిన నా యకులే హాజరయ్యారు.
అంతేకాదు కొడంగల్‌లో రేవంత్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే కోస్గిలో ఓ ముఖ్య నాయకుడు పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమై ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని వీడేది లేదని తీర్మానం చేసేనట్లు విశ్వసనీయ సమాచారం. దశాబ్దాలుగా పార్టీలో కొనసాగి ఇప్పుడు వేరే పార్టీలో ఎలా చేరుతామని మండలంలోని ఓ వర్గం తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు మద్దూరు మండల పరిస్థితి రేవంత్‌కు అంతుబట్టడం లేదు. ఇప్పటికే ముఖ్య అనుచరుడు మాజీ జెడ్పీటీసీ(ప్రస్తుత జెడ్పీటీసీ భర్త) బాల్‌సింగ్ నాయక్ టీఆర్‌ఎస్‌లో చేరి పెద్ద దెబ్బ కొట్టారు.
ఇలా అధికార టీఆర్‌ఎస్ వేస్తున్న స్కెచ్‌లో భాగంగా సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అందులో భాగంగా ఆదివారం కూడా మద్దూరు నుంచి పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కొమ్మూరు ఎంపీటీసీ టి.వెంకటమ్మ, అప్పన్నపల్లి శ్రీనివాస్(పెదిరిపాడ్), రాములమ్మ(మన్నాపూర్)తో పాటు నందిపాడ్, తిమ్మారెడ్డిపల్లి సర్పంచ్‌లు ముద్దమ్మ, చుక్కమ్మ, మాజీ సర్పంచ్ రాజయ్య, ఇతర కార్యకర్తలను తెలంగాణ భవన్‌లో లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి సమక్షాన బాల్‌సింగ్‌నాయక్ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment