సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి పాలమూరు ప్రాంతం నుంచి కాంగ్రెస్‌లోకి నేతలు చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొడంగల్ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి చేరికతో మొదలైన ఈ ప్రస్థానం కొనసాగుతోంది. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఉమ్మడి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నేతలంతా కాంగ్రెస్‌లో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. గతంలో కాంగ్రెస్ అంటేనే విముఖత చూపే మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి సైతం హస్తానికి జై కొడుతున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇక దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన హైకోర్టు న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి(జీఎంఆర్) కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం. అదే విధంగా టీడీపీ సీనియర్ నేతలు కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు కూడా చేరుతారనే ప్రచారం.. బీసీ సామాజికవర్గం నుంచి బలమైన నేతగా పేరొందిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎర్ర శేఖర్‌ను కాం గ్రెస్‌లోకి తీసుకునేందుకు ఒక వర్గం ఆసక్తి కనబరుస్తుండడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇదే సమయంలో కాంగ్రెస్ గ్రూపు తగాదాలు సైతం అదే స్థాయిలో రాజుకుంటున్నాయి.
రెండు వర్గాలు
పాలమూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బలోపేతమవుతుందనే ప్రచారం ఒక వైపు ఉండగా... మరోవైపు గ్రూపు తగాదాలు ఆ పార్టీ కేడర్‌ను అయోమయంలో పడేస్తోంది. వాస్తవానికి త కాలంగా జిల్లా కాంగ్రెస్‌లో డీకే అరుణ మాట శాసనంగా చెల్లుబాటైంది. జిల్లాకు సంబంధించిన ఏ విషయమైనా పీసీసీ ముఖ్యనేతలు ఆమెతో చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారని ప్రచారం. 2014లో పార్టీ అధికారంలోకి రాకపోయినా మూడున్నరేళ్లుగా డీకే.అరుణ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై నడిపించింది. అప్పటి వరకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదు. కానీ ఏడాది కాలంగా ఆయన జిల్లా రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అనేక సమీకరణాలను జోడిస్తున్నారు. అంతేకాదు కాంగ్రెస్‌ను బలోపేతమని చెబుతూ ఇతర పార్టీల కీలక నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నారు. ప్రజల్లో పట్టున్న నేతలను పార్టీకి తీసుకుంటే మరింత ఊపు వస్తోందని జైపాల్‌రెడ్డి వర్గం పేర్కొంటుంది. అయితే తమను సంప్రదించకుండా కొత్త వారిని తీసుకురావడంపై డీకే అరుణ వర్గం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమతో చర్చించకపోవడం దేనికి సంకేతమంటూ ప్రశ్ని స్తున్నారు.
నాగం చేరికపై భగ్గు..
జిల్లాలో సీనియర్ రాజకీయనేతగా గుర్తింపు పొందిన నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరే అంశం వివాదాస్పదమవుతోంది. నాగం చేరిక నేపథ్యంలో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న డీకే అరుణ, జైపాల్‌రెడ్డి గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. నాగం చేరికను అడ్డుకునేందుకు డీకే.వర్గం ఢిల్లీ స్థాయిలో పైరవీ చేసినట్లు వార్తలొచ్చాయి. అంతేకాదు తాజాగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి సైతం గురువారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నాగం చేరికపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు జైపాల్‌రెడ్డి రహస్య అజెండాతో ముందుకెళ్తున్నారంటూ వర్గపోరును బయటపెట్టారు. జైపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసి, నాగంను మహబూబ్‌నగర్ ఎంపీగా బరిలో దింపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే జిల్లాలో డీకే.అరుణ వర్గంగా ఉన్న వారిని దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆసక్తిగా గమనిస్తున్న గులాబీ పార్టీ..
పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై అధికార గులాబీ పార్టీ ఆసక్తిగా గమనిస్తోంది. కాంగ్రెస్‌లో చేరే నాయకులకు సంబంధించి తీక్షణంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా జనాదధారణ కలిగిన నేతలు కాంగ్రెస్ పట్ల మొగ్గుచూపడానికి గల కారణాలేంటనే అంశాలపై ఆరా తీస్తున్నారు. దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా పాలమూరు ప్రాంతంలో గులాబీ పార్టీ పట్టు బిగించేందుకు సీఎం కేసీఆర్ అనేక వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీ నేతలకు మింగుడు పడటంలేదు. ముఖ్యంగా సీఎం కేసీఆర్‌పై రాష్ట్రం మొత్తంలో తీవ్ర విమర్శలు గుప్పించే రేవంత్‌రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి కాంగ్రెస్‌కు జై కొడుతుండడంపై ఆ పార్టీ ముఖ్య నేతలపై ఒత్తిడి పెరుగుతోందని చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment