పాలమూరులో రేవంత్ ఒంటరేనా??
► జిల్లాలో టీడీపీకి మిగిలింది ఒక్క ఎమ్మెల్యేనే
► టీఆర్‌ఎస్‌లోకి రాజేందర్‌రెడ్డితో...రేవంత్‌రెడ్డి ఒంటరేనా?
► రోజురోజుకూ పొడివడుతున్న ‘తెలుగుదేశం’ ప్రతిష్ట
► మనోధైర్యం కోల్పోతున్న ద్వితీయశ్రేణి నాయకులు
► అధికార పార్టీ వైపు చూపు..కాపాడుకునే పనిలో నాయకత్వం
మహబూబ్‌నగర్: దశాబ్దాల పాటు జిల్లాలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ... నేతల వలసల కారణంగా ప్రస్తుతం ఉనికిని చాటుకునే పరిస్థితికి దిగజారింది. జిల్లానుంచి అనేకమంది రాష్ట్ర నేతలను అందించిన ఆ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లోపంతో సంక్షోభ దిశలో పయనిస్తోంది. తెలంగాణ వచ్చిన సమయంనుంచి జిల్లాలో ఏటికి ఎదురీదుతున్న పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జిల్లానుంచి కేవలం రెండు స్థానాలనే గెలుచుకుంది.
తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. దీంతో జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేగా ఆ పార్టీ శాసనసభపక్ష నాయకుడు రేవంత్‌రెడ్డి ఒక్కరే కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ద్వితీయశ్రేణి ముఖ్యనాయకులపై కూడా గులాబీ పార్టీ మరోసారి దృష్టి సారించి వారిని తమలో కలిపేసుకునే ప్రయత్నాలు చేస్తుందన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో గుబులు రేపుతోంది. అయితే ఇప్పటికే అనేకమంది టీడీపీ నేతలు అధికార పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రేవంత్‌రెడ్డి మనోధైర్యం కల్పిస్తారా..?
టీడీపీ శాసనసభాపక్ష నేతగా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి జిల్లాలో ఆ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఏ మేరకు మనోధైర్యం కలిపిస్తారో.. రాజకీయ వలసలను ఏ మేరకు నివారించ గలుగుతారన్న సందేహం ఆ పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో కీలకనేతగా ఉన్న రేవంత్‌రెడ్డి జిల్లాలో మాత్రం ఒకే ఒక్క శాసనసభ్యుడిగా ఒంటరి పోరాటం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అటు రాష్ట్రస్థాయిలో..ఇటు జిల్లా స్థాయిలో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఎన్ని అవంతారాలు ఎదురైనా పార్టీలోనే కొనసాగుతున్న వివిధ నియోజకవర్గాల నేతలు రాజకీయంగా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రికి ఇప్పటికే టీఆర్‌ఎస్ గాలం వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత శాసనసభ ఎన్నికల సమయంలోనే ఆయనను చేర్చుకోవడానికి ప్రయత్నం చేసినా చివరి నిమిషంలో విఫలం కావడంతో సదరు నేత టీడీపీలోనే కొనసాగుతున్నారు. అలాగే పార్టీలో మండల, జిల్లా స్థాయిలో పట్టున్న టీడీపీ నేతలను ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేర్చే బాధ్యతను అధికార పార్టీకి చెందిన పలువురు నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది.
రోజురోజుకూ బలహీన పడుతున్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు అధికార పార్టీ వైపు చేరడంతో మండల స్థాయిలోని పార్టీ బలహీనమైంది. పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించడానికి, తమ ఓటు బ్యాంకును పెంచుకునే లక్ష్యంతో రెండు నెలల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీచేసినప్పటికీ మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. రెండు శాసనసమండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు చేరొక స్థానం గెలుపొందగా, టీడీపీకి మాత్రం ఆశాభంగం ఎదురైంది.
ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో సైతం ఉంటుందన్న భావన మండల, నియోజకవర్గ స్థాయిలో వ్యక్తం కావడం... వారిలో మనోధైర్యం కల్పించడానికి పార్టీ నాయకత్వం పూర్తిస్థాయి దృష్టి సారించకపోవడంతో అనేక మంది తమ తమ స్థాయిలో రాజకీయ దారులను వెతుక్కుంటున్నారు. జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు పలువురు ఇప్పటికే టీడీపీలో చేరగా, మరికొందరు అదే బాటలో పయనించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత రేవంత్‌రెడ్డి జిల్లాలో పార్టీ పునర్జీవం కల్పించడానికి ఏ రకంగా వ్యవహరిస్తారోనన్న అంశం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది.