పేట సభలో గిరిజన మహిళల కోలాహలం
సాక్షి, నారాయణపేట: రాష్ట్రంలో ఏ సభకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు.. ఈ ఊపు చూస్తుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గెలుపు ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు.
అప్పట్లో పాలమూరును తొమ్మిదేళ్లు దత్తత తీసుకున్న చంద్రబాబు ఆగం చేసిండు.. మళ్లీ పాలమూరు– రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టును అడ్డుకుంటూ కేసులు వేశారని విమర్శించారు. ఇప్పుడేమో సిగ్గులేకుండా మక్తల్‌లో టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టిండు.. ఇక్కడ ఎస్‌ఆర్‌రెడ్డి గెలుస్తాడు.. ప్రతి ఇంటికి ఒకరూ చొప్పున పక్కనున్న మక్తల్ నియోజకవర్గంలో అడుగుపెట్టి అక్కడి టీడీపీ అభ్యర్థిని ఓడించి తెలంగాణ సత్తా ఏమిటో చాటాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.
పచ్చబడుతున్న పాలమూరు జిల్లాలో ప్రాజెక్టు నిర్మాణం కాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. ఆంధ్రవాళ్ల పెత్తనం తెలంగాణలో ఎందుకు అని ప్రశ్నించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతలను రెండేళ్లలో పూర్తిచేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కర్వెన నుంచి మొదటి దశలోనే పేట జాయమ్మ చెరువుకు రూ.20 కోట్లు ఇచ్చి ఎత్తిపోతలతో నీళ్లు నింపుతామన్నారు.
‘పేట’ను జిల్లా చేస్తా
టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డిని కారు గుర్తుకు ఓటేసి లక్ష మెజారిటీతో అసెంబ్లీకి పంపించండి.. మీ చిరకాల వాంఛ అయిన పేటను ప్రభుత్వం వచ్చిన మూడు నెలల్లో జిల్లాగా ప్రకటిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
58 ఏళ్లలో ఏ ఒక్క సీఎం ఒక్క జిల్లాను చేయలేదు.. 31 జిల్లాలు చేసిన కేసీఆర్.. 32వ జిల్లాగా పేటను చేయడం ఖాయమన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదని, మూడు నెలల్లో పేటకు వచ్చి కలెక్టర్, ఎస్పీ కార్యాలయాన్ని నా చేతులమీదుగా కొబ్బరికాయ కొట్టి ప్రారంభించి వెళ్తానన్నారు.
చేనేతకు చేయూత..
చేనేత కార్మికులను ఏనాడు ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. చేనేతకు చేయూతనిస్తూ 50 శాతం సబ్సిడీతో నూలు, కావాల్సిన రసాయనిక పదార్థాలు ఇస్తామన్నారు. అలాగే నేతన్నలు తయారు చేసిన చీరలను తామే కొనుగోలు చేసి.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు.
దత్తత తీసుకోండి..
కర్ణాటక సరిహద్దులో ఉన్న మారుమూల నారాయణపేటను దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజేందర్‌రెడ్డి కేసీఆర్‌ను కోరారు. అలాగే ఈ ప్రాంత రైతుల చిరుకాల వాంఛ అయిన నారాయణపేట జాయమ్మ చెరువును కృష్ణాజలాలతో నింపాలని ఆకాంక్షించారు. అన్నిరంగాల్లో వెనుకబడిన ఈ ప్రాంతంలో విద్య, వైద్యం తదితర అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కేసీఆర్‌కు విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment