సాక్షి, భూపాలపల్లి: ఈ సారి ఎన్నికల్లో యువకులు కీలక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో కొత్త యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. దీంతో వారిని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. జిల్లాలోని భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల సంఖ్య పెరిగింది. రెండు సెగ్మెంట్లలో కలిపి లక్షకు పైగా యువ ఓటర్లు ఉన్నారు. వీరు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకంగా మారనుండడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి వారిపై పడింది. వారు ఎటువైపు మొగ్గుచూపుతారోనని యువకుల నాడి పట్టుకునేందుకు నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. యువతను ఆకట్టుకునేందుకు ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఉద్యోగ నోటిఫికేషన్లు తదితర హామీలను ప్రత్యేకంగా గుప్పిస్తున్నారు.
1,13,322 మంది యువ ఓటర్లు..
రెండు నియోజకవర్గాల్లో కలిపి 1,13,322 మంది యువ ఓటర్లు ఉన్నారు. వీరిలో 18–19 సంవత్సరాల వయసు ఉన్నవారు 9,923 మంది ఉంటే వీరిలో యువకులు 5,919, యువతులు 4,004 మంది ఉన్నారు. 20–29 సంవత్సరాల మధ్య వయసు ఓటర్లు 1,03,399 మంది ఉండగా వీరిలో పురుషులు 57,104, స్త్రీలు 46,295 మంది ఉన్నారు. ములుగు నియోజకవర్గంతో పోలిస్తే భూపాలపల్లిలో ఎక్కువగా యువ ఓట్లు ఉన్నాయి. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారిని తీసుకుంటే ములుగులో 52,360 ఓటర్లు ఉండగా భూపాలపల్లి పరిధిలో 60,962 మంది ఉన్నారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు యువ ఓటర్లపై ఫోకస్ పెంచాయి. దాదాపు అందరూ విద్యావంతులే కావడంతో వారి ఓట్లు ఎలా పొందాలనే ఆలోచనలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్లాడానికి నాయకులు వ్యూహాలు పన్నుతున్నారు.
ఆకర్షించే పనిలో పార్టీలు
జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక ఇప్పుడిప్పుడే పార్టీల్లోకి చేరికలు పెరుగుతున్నాయి. చేరికల్లో ముఖ్యంగా యువత ఎక్కువ సంఖ్యలో ఉండడంతో నాయకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు హామీలు ఇస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని చెబుతున్నాయి. అధికారంలోకి రాగానే మెగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామని అంటున్నాయి. మరో వైపు యువత ఎప్పుడూ కేసీఆర్ పక్షమే అని టీఆర్‌ఎస్ నాయకులు చెబుతుండగా.. కాంగ్రెస్ మాత్రం ప్రభుత్వంపై యువత తీవ్ర వ్యతిరేకంగా ఉందని, వారు తమ పార్టీనే ఆదరిస్తారనే ధీమాలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment