టిఫినీలు.. తిన్నారా..!
ప్రధాన రాజకీయపార్టీల క్యాంప్
కార్యాలయాల వద్ద ఎన్నికల కళ
రోజు విందు వినోదాలు కల్పించాల్సిందే
సాధారణ ఎన్నికల ప్రచారం వేడి రాజుకొంటున్న వేళ.. ఆయా పక్షాల క్యాంప్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. పార్టీలో చేరేకొత్త ముఖాలతో కళకళలాడుతున్నాయి. ఉదయం అల్ఫాహారం మొదలుకుని.. రాత్రి భోజనం వరకు నేతలు అన్ని తామై చూసుకుంటున్నారు. టిఫిన్‌లు ముగియగానే అభ్యర్థులు వెంటరాగా ప్రచారరథాలు కాలనీల్లో వాలిపోతున్నాయి.
ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు నానాపాట్లు పడుతున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ చిటపటమనగానే క్యాంప్‌ల వద్దకు తరలుతున్నాయి. విందు భోజనం కాగానే కాసేపు సేదతీరి.. మళ్లీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి.. సాయంత్రం వేళ ఎవరి‘దారి’ వారు చూసుకుంటున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రధానపార్టీల ప్రచార పర్వం సాగుతోన్న తీరుపై ‘సాక్షి’ ప్రత్యేకకథనం..
కలెక్టరేట్, న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో అన్నిపార్టీల కార్యాలయాలు, స్వతంత్రుల క్యాంపు కార్యాలయాలు పార్టీ శ్రేణులు, అభిమానులతో కళకళలాడుతున్నాయి. రోజు ఉదయం 7 నుంచి రాత్రి 10గంటల వరకు వీరికి సకల మర్యాదలు చేస్తున్నారు. ఇక ఉదయం టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీతోపాటు రాత్రి అన్ని సౌకర్యాలు సమకూర్చుతున్నారు.
దీంతో ప్రతి కార్యాలయం వద్ద సందడి నెలకొంది. ఇక ఓటర్లు అయితే ఎవరికి వారే గ్రూపులుగా ఏర్పడి బరిలో ఉన్న నేతలను కలుస్తూ హడావుడి చేస్తున్నారు. మనకే గెలుపు అవకాశాలు ఉన్నాయంటూ ఊదరగొడుతున్నారు.అభ్యర్థుల వెంట ప్రచారంలో పాల్గొనే వారంతా ఉదయం ఒకరి వెంట, మధ్యాహ్నం ఇంకొకరి వెంట, రాత్రికి మరొకరివెంట.. ఇలా రోజుకు ముగ్గురిని వెంట ప్రచారం చేసేపనిలో బిజీగా గడుపుతున్నారు. వీరికి ఎవరి వెంట తిరిగితే అంత కూలీ చెల్లిస్తుండటంతో ఓటర్లు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు.