సాక్షి, హైదరాబాద్: ఇడ్లీతో టిఫిన్.. బిర్యానీతో భోజనం... ఏడాదంతా ఇదే మెనూ! ఇద్దరు హైదరాబాదీ స్విగ్గీ కస్టమర్ల తీరిది. 2023లో ఓ ఇడ్లీ ప్రియుడు ఇడ్లీల కోసం వెచ్చించిన సొమ్ము అక్షరాల రూ. 6 లక్షలు. మరో బిర్యానీ ప్రియుడైతే ఏకంగా ఏడాదిలో 1,633 బిర్యానీలు ఆర్డర్ చేశాడు. అంటే రోజుకు నాలుగు బిర్యానీల కంటే ఎక్కువే ఆరగించాడు. దేశవ్యాప్తంగా ప్రతి ఆరు బిర్యానీ ఆర్డర్లలో ఒకటి హైదరాబాద్ నుంచే ఉందని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’వార్షిక నివేదిక వెల్లడించింది. అందులోని పలు ఆసక్తికర ఆర్డర్లివే..
బిర్యానీ తింటూ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్..
దేశవ్యాప్తంగా ప్రతి సెకనుకు 2.5 బిర్యానీల కోసం ఆర్డర్లు వచ్చాయి. ప్రతి 5.5 బిర్యానీ ఆర్డర్లలో ఒక వెజ్ బిర్యానీ ఉంది. కొత్తగా 20.49 లక్షల మంది యూజర్లు స్విగ్గీలో బిర్యానీలు ఆర్డర్ చేశారు. చంఢీగఢ్‌లోని ఓ బిర్యానీ ప్రియుల కుటుంబం అక్టోబర్‌లో జరిగిన భారత్–పాక్ ప్రపంచ క్రికెట్ కప్ మ్యాచ్ రోజున ఏకంగా 70 బిర్యానీలు ఆర్డర్ చేసింది.
దేశవ్యాప్తంగా ఆ రోజు ప్రతి నిమిషానికి 250 బిర్యానీలను స్విగ్గీ డెలివరీ చేసింది. స్విగ్గీ డెలివరీ పార్ట్‌నర్స్ గతేడాది 16.64 కోట్ల కిలోమీటర్ల మేర విద్యుత్ వాహనాలు, సైకిళ్లపై ప్రయాణించి డెలివరీ చేశారు. గతేడాది అత్యధికంగా చెన్నైకి చెందిన వెంకటేశన్ 10,360, కొచి్చకి చెందిన సంథిని 6,253 ఆర్డర్లను డెలివరీ చేశారు.
చిప్స్, బిస్కెట్ల కోసం రూ.31,748 ఖర్చు..
నిత్యావసరాలను విక్రయించే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో కస్టమర్లు అత్యధికంగా పాలు, పెరుగు, ఉల్లిగడ్డల కోసం వెతికారు. జైపూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 67 ఉత్పత్తులను ఆర్డర్ చేశాడు. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి కాఫీ, జ్యూస్, బిస్కెట్లు, చిప్స్ కోసం ఒక్క ఆర్డర్‌లో అత్యధికంగా రూ. 31,748 ఖర్చు చేశాడు. అత్యంత వేగంగా ఢిల్లీలో ఒక కస్టమర్‌కు 65 సెకన్లలో నూడుల్స్ ప్యాకెట్లను డెలివరీ చేశారు. హైదరాబాద్, ముంబై కంటే బెంగళూరు నుంచి మామిడి పండ్ల కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.
ఒక్క రోజులో 207 పిజ్జాలు..
చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ నుంచి ఒక్కో కస్టమర్ నుంచి గరిష్టంగా 10 వేల కంటే ఎక్కువే ఆర్డర్లు వచ్చాయి. భువనేశ్వర్‌లోని ఒక కస్టమర్ ఒక్క రోజులో 207 పిజ్జాలు ఆర్డర్ చేశారు. ముంబైకి చెందిన ఓ కస్టమర్ ఏడాదిలో రూ. 42.3 లక్షల విలువైన ఫుడ్ ఆర్డర్లు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ ప్రాంతంలో జరిగిన ఓ పెద్ద పార్టీలో 269 ఐటెమ్స్ ఆర్డర్ చేశారు. దుర్గా పూజ సందర్భంగా దేశవ్యాప్తంగా 77 లక్షల రసగుల్లాల ఆర్డర్స్ వచ్చాయి. నవరాత్రి రోజుల్లో చాలా మంది ఫేవరేట్ ఆర్డర్ మసాలా దోశ.
కేక్‌లే కేక్‌లు..
గార్డెన్ సిటీగా పేరొందిన బెంగళూరు కేక్ సిటీగా మారింది! 2023లో ఈ నగరంలో 85 లక్షల చాక్లెట్ కేక్స్ ఆర్డర్లు వచ్చాయి. ప్రేమికుల దినోత్సవం నాడు దేశవ్యాప్తంగా నిమిషానికి 271 కేక్స్ ఆర్డర్ చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ కస్టమర్ ఒక్క రోజులో 92 కేక్‌లు ఆర్డర్ చేశాడు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ సమయాల్లోనూ కేక్‌లు ఆర్డర్ చేయడం గమనార్హం. 2023లో వేగాన్ ఆర్డర్లు 146 శాతం మేర పెరిగాయి. అలాగే మిల్లెట్స్ ఆధారిత ఆహార ఉత్పత్తుల ఆర్డర్లు 124 శాతం మేర పెరిగాయి. బుక్‌ఫీట్, ఫాక్సీటేల్, జొవార్, బాజ్రా, రాగి, రాజ్‌గిరి వంటి డిషెస్ కోసం ఎక్కువ ఆర్డర్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment