రాజకీయాల్లో విలువలు దిగజారాయి | Politics Lost It's Credibility | Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో విలువలు దిగజారాయి

Published Mon, Nov 12 2018 2:12 PM | Last Updated on Mon, Nov 12 2018 2:16 PM

Politics Lost It's Credibility - Sakshi

బూర్గంపాడు: ‘ ప్రస్తుతం రాజకీయాల్లో విలువలు దిగజారాయి. నాటికి నేటికి రాజకీయాల్లో ఎంతో వ్యత్యాసం వుంది. గిరిజనులకు రిజర్వ్‌ అయిన  నియోజకవర్గాలలో కూడా కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నారు. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి వ్యాపారధోరణితో వ్యవహరిస్తున్నాయి.’  అని చెబుతున్నరు మాజీ ఎమ్మెల్యే కుంజా భిక్షం. 
 
సాక్షి:  ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి? 
కుంజా: సీపీఐ నుంచి బూర్గంపాడులో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాను. పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ రోజుల్లో ఎమ్మెల్యే కాగలిగాను. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఆ రోజుల్లో నమ్ముకున్న పార్టీ కోసం, సిద్ధాంతాల కోసం నాయకులు, కార్యకర్తలు పాటుపడ్డారు. నేడు అంత వ్యాపారమయమైంది.
 
సాక్షి: పదేళ్లు శాసనసభ్యునిగా పనిచేసిన మీరు కనీసం ఓ మంచి ఇల్లు కూడా కట్టుకోలేకపోయారు. కారణం? 
కుంజా: పదేళ్లు శాసనసభ్యునిగా పనిచేసిన నేను ఏ రోజు ఎవరి వద్ద రూపాయి తీసుకోలేదు. నాడు సీపీఐ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యే జీతం కూడా పార్టీకి ఇచ్చి, అక్కడ్నుంచి నా కుటుంబ ఖర్చులకు కొంతమొత్తాన్ని తీసుకున్నాను. 1989నుంచి 1999 వరకు ఎమ్మెల్యేగా పనిచేశాను. పార్టీ సిద్ధాంతాల కోసం నిబద్ధతో నిజాయితీగా ప్రజాసేవ చేశాను. అందుకే నేను ఆర్థికంగా ఏమీ సంపాదించుకోలేకపోయాను. కనీసం ఓ మంచి ఇల్లుకూడా కట్టించుకోలేకపోయాను. అయినప్పటికీ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసేననే సంతృప్తి, గౌరవం మాత్రం మిగిలింది.
 
సాక్షి: ప్రస్తుతం మీరు బీజేపీలో ఉన్నారు. మీ అల్లుడు చందా సంతోష్‌ బీజేపీ అభ్యర్థిగా పినపాక నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు.? 
కుంజా: నేను, నా వియ్యంకులు చందా లింగయ్య బీజేపీలో ఉండటంతో నా అల్లుడు సంతోష్‌కు బీజేపీ టిక్కెట్‌ సాధించుకోగలిగాం. వైద్యవృత్తి నుంచి ప్రజాసేవ చేయాలనే బలమైన సంకల్పంతో సంతోష్‌ రాజకీయాలలోకి వచ్చాడు. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించే ప్రణాళికలను అతను సిద్ధం చేసుకుని ఎన్నికల బరిలో నిలిచాడు. నిస్వార్థ ప్రజాసేవ కోసం ఎన్నికల్లో పోటీలో నిలిచిన అతనిని ప్రజలు ఆశీర్వాదిస్తారని ఆశిస్తున్నాను. 
 
సాక్షి: ప్రస్తుత ఎన్నికలపై మీ అభిప్రాయం? 
కుంజా: ఈ ఎన్నికలను చూస్తుంటే భయమేస్తోంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్నారు. కోట్ల రూపాయలు ఎన్నికల్లో కుమ్మరిస్తున్నారు. నాడు లక్షరూపాయ లు ఖర్చుచేస్తే గొప్పగా అనుకునేవాళ్లం. ఇప్పు డు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలలో పదికో ట్లు, ఇరవైకోట్లు అని ప్రచారం సాగుతోంది. ఈ «ధోరణి ఏ మాత్రం మంచిది కాదు. రానున్న రోజులలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement