
‘ధర్నాచౌక్ అంటే ప్రభుత్వానికి భయమెందుకు?’
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన సాగుతున్నట్లయితే, ఇందిరాపార్క్ వద్ద ధర్నాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో చెప్పాలని శాసన మండలిలో కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి అధికార పక్షాన్ని ప్రశ్నించారు. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మండలిలో పలు అంశాలపై విపక్ష నేతలు మాట్లాడుతూ అధికారపక్షాన్ని ఇరుకున పెట్టారు.
ఎమ్మెల్సీ పొంగులేటి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రుణమాఫీ పూర్తిగా అమలుకాకపోవడంతో రైతులకు సకాలంలో రుణాలు అందక, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించక నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరోవైపు అంతా ఫీల్‌గుడ్ అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించిందని దుయ్యబట్టారు. ధర్నాచౌక్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని భావించడం ఏరకమైన ప్రజాస్వామ్యమో ప్రభుత్వం చెప్పాలన్నారు.