సాక్షి, జనగాం : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ క్లారిటీ ఇవ్వాలని మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. మూడో ఫ్రంట్ మూన్నాళ్ల ముచ్చట అయినట్లుగానే.. కేసీఆర్‌ను ప్రజలు బొందపెడతారని విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుపై అనైతిక వ్యాఖ్యలు చేయటం సరికాదని అన్నారు. తెలంగాణ ద్రోహులతో 2009 ఎన్నికల్లో పొత్తుపెట్టుకుని టీడీపీతో ఎలా జతకట్టారని ప్రశ్నించారు. అప్పుడు పొత్తుపెట్టుకుని ఇప్పుడు దూషిస్తున్నావ్! నువ్వు మనిషివేనా? అంటూ మండిపడ్డారు. కేసీఆర్ మాటలు సిగ్గుచేటు, అనైతికతకు నిదర్శనమన్నారు. అప్పట్లో పొత్తు పెట్టుకున్న కారణంగానే టీఆర్‌ఎస్‌కు 10 సీట్లు వచ్చాయని గుర్తుచేశారు.
టీడీపీలో మంత్రి సీటు రాకపోవటంతో కపటనాటకాలు వేసి, దొంగ దీక్షలతో అధికారంలోకి వచ్చి ప్రజలను ముంచాడని విమర్శించారు. ఫామ్‌హౌస్‌లో కూర్చుని సోకులాగా మాట్లాడితే సరిపోదని, ప్రజలకు అభివృద్ధి చూపించాలని ఎద్దేవా చేశారు. ఈడీ, పాస్ పోర్ట్స్, సహారా కేసుల్లో కేసీఆర్ దోషిగా ఉన్నారని, నిర్దోషిగా బయటపడటానికే మోదీ దగ్గర మోకరిల్లారని పేర్కొన్నారు. తెలంగాణను అప్పుల రాష్ట్రంగా తీర్చి దిద్దారని ఆరోపించారు. సిమెంట్ ధర పెంచిన ఘనత కేసీఆర్‌దేనని, అమరవీరుల ఆశయాలను, సామాన్యుల నడ్డి విరచడానికే ధరలు పెంచావన్నారు.
Comments
Please login to add a commentAdd a comment