![సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య. చిత్రంలో సునీతాలక్ష్మారెడ్డి](/styles/webp/s3/article_images/2017/09/2/51422818608_625x300.jpg.webp?itok=FHf0BOWV)
సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతున్న పొన్నాల లక్ష్మయ్య. చిత్రంలో సునీతాలక్ష్మారెడ్డి
సర్కార్‌పై పొన్నాల ధ్వజం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అనుభవరాహిత్యం, అవగాహనా లోపంతో కేసీఆర్ ప్రభుత్వం ఎర్రగడ్డ పాలు కావద్దని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు. తాను ఈ వ్యాఖ్యలు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నవి కావని, ప్రజా శ్రేయస్సును కాంక్షించి చెప్తున్న మాటలన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ, సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిని వికారాబాద్‌కు తరలించడంపై కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఉద్యమాలతోనే ప్రభుత్వం ఫాస్ట్ పథకంపై వెనక్కి తగ్గిందన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు భయపడే 421 జీఓను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందని కార్యకర్తలు తమ దృష్టికి తెచ్చారన్నారు. పార్టీకి దూరమైన వారిని తిరిగి కలుపుకొనిపోయి బలోపేతం చేస్తామన్నారు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజా సమస్యల పట్ల నిలబడి పోరాడుతుందన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా అవతరించేలా చేసింది, కాడెద్దుగా నడుస్తున్న వ్యవస్థను మంగళ్‌యాన్ వరకు తీసుకొనిపోయింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు.
పార్టీకి దూరమైన వారిని తిరిగి కలుపుకొనిపోయి, వారి భాగస్వామ్యంతో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేందుకే జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకొని అధినాయకత్వానికి పంపుతామన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలపై తరచుగా మీడియాకెక్కడం మంచిదికాదని కార్యకర్తలంటున్నారని, పార్టీలోని కొందరు పెద్దలు దీన్ని పాటించాలని పరోక్షంగా వి.హన్మంతరావు, దానం నాగేందర్‌లాంటి నాయకులనుద్దేశించి పొన్నాల అన్నారు.