సామాన్యులకు సందడి.. ఆదివారం అంగడి.. | Erragadda Sunday Market At Hyderabad | Sakshi
Sakshi News home page

సామాన్యులకు సందడి.. ఆదివారం అంగడి..

Published Sun, Nov 10 2024 7:52 AM | Last Updated on Sun, Nov 10 2024 7:52 AM

Erragadda Sunday Market At Hyderabad

చౌరస్తా మొదలు..  ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌  వరకూ విస్తరణ 

 కాటుక బరణి నుంచి..  కార్‌ టైర్ల వరకూ లభ్యం 

 ఆదివారం వస్తే  షాపింగ్‌ షురూ.. అన్నట్టే..!

నగరంలోని ఆదివారం అంగడికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోంది ఎర్రగడ్డ మార్కెట్‌. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ అందరూ షాపింగ్‌ చేసేలా కాటుక బరణి నుంచి కార్‌ టైర్ల వరకూ అన్నీ లభ్యమవుతాయి. దీంతో ఈ మార్కెట్‌కు రాను రానూ క్రేజ్‌ పెరిగిపోతోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంత సామాన్యులు, మధ్యతరగతి పాలిట ‘సంత’సాన్ని నింపుతోంది. ఈ ఓపెన్‌ మాల్‌.. శ్రీమంతులకు ఆటవిడుపు.. ఆదివారం సూర్యోదయం కాకమునుపే ‘గిట్టుబాటు’ అంకెలను గుక్కతిప్పుకోకుండా పలకడంలో అక్కడ వ్యాపారులు పోటీపడుతుంటారు. ఆ రోజు అందరికీ సెలవు. కానీ, వారికి ఈ సెలవు రోజే బతుకు దెరువు. ఎర్రగడ్డ చౌరస్తా మొదలు.. ఫతేనగర్‌ ఫ్లైఓవర్‌ వరకూ విస్తరిస్తూ పోతోంది..దీని గురించిన మరిన్నివివరాలు..  – సనత్‌నగర్‌

శతాబ్దం కాలం క్రితం 15–20 దుకాణాలతో మొదలైన సంత నేడు దాదాపు వెయ్యి మంది చిరువ్యాపారులకు బతుకుదెరువుకు కేంద్రంగా మారింది. రోడ్డే ఈ సంతకు అడ్డా. నాడు ఎర్రగడ్డ చౌరస్తాకే పరిమితమైన వ్యాపారాలు నేడు కిలోమీటరు పొడవున తమ షాపులను విస్తరించారు. చౌరస్తా నుంచి మొదలుకొని సనత్‌నగర్‌ బస్టాండ్‌ వరకూ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. 

ఆల్‌ ఇన్‌ వన్‌ అంగడి.. 
చిన్నా.. పెద్దా మాల్‌ అనే తేడా లేదు.. వాటిల్లో ఉండే ప్రతి వస్తువూ ఇక్కడ లభ్యమవుతోంది. స్రూ్కడ్రైవర్‌ నుంచి సూట్‌కేస్‌ వరకూ.. రెడీమేడ్‌ దుస్తుల నుంచి రేబాన్‌ గ్లాసెస్‌ వరకూ, వంటింటి పాత్రల నుంచి వయ్యారాలు ఒలకబోసే అందమైన ఆట»ొమ్మల వరకూ, నాటి గ్రామ్‌ఫోన్‌ల నుంచి నేటి స్మార్ట్‌ఫోన్ల వరకూ.. ఇలా ప్రతిదీ ఈ సంతలో దొరుకుతాయి. ముఖ్యంగా నిత్యం ఇంట్లో ఉపయోగించే వస్తువులకు ఈ మార్కెట్‌ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఎరగ్రడ్డ–సనత్‌నగర్‌ మార్గం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోతూ సందడిగా మారుతోంది.

‘సెకండ్స్‌’కు పెట్టింది పేరు.. 
ఎర్రగడ్డ సంత అంటే వస్తువులు ‘సెకండ్స్‌’లో అమ్ముడుపోతాయన్నది వ్యాపార వర్గాలతో పాటు వినియోగదారుల నుంచి వినిపించే మాట. షర్టులు, ఫ్యాంట్లు, గొడుగులు, సీడీలు, ఎలక్ట్రికల్, ఐరన్‌ వస్తువులు.. ఇలా ఎన్నో రకాల వస్తువులు సెకండ్‌ హ్యాండ్‌లో లభిస్తాయి. ఇక ప్రొక్లెయినర్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌ వరకూ.. ఎలాంటి యంత్రాలు, వస్తువులకైనా కావాల్సిన విడి భాగాలు (స్పేర్‌పార్ట్స్‌)కు ఈ సంత ఫేమస్‌. అందుకే ఎర్రగడ్డ సంతకు ఇంత క్రేజ్‌.  

నగరం నలుమూలల నుంచి..
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్, అమీర్‌పేట నుంచే కాకుండా నగరం నలుమూలల నుంచి ఈ మార్కెట్‌ను సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకుని మరీ వెళ్తుంటారు. ప్రతి వారం 30–40 వేల మంది వినియోగదారులు ఈ మార్కెట్‌ను సందర్శిస్తుంటారని ఓ అంచనా.  

సీజనల్‌ వ్యాపారాలకు ఊపునిస్తూ..
చలికాలం మొదలైతే ఇక్కడ స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు, మఫ్లర్లు, షాల్స్‌ అమ్మకాలు భారీగా జరుగుతాయి. ధాన్యపు రాశులు పోసినట్లు రోడ్లపై గుట్టలు పోస్తారు. వర్షాకాలంలో రెయిన్‌ కోట్లు, రంగురంగుల గొడుగులతో మార్కెట్‌ నిండిపోతుంది. వేసవి వచి్చందంటే కాటన్‌ దుస్తుల అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి.

వందేళ్ల చరిత్రకు సాక్ష్యం..
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి.. కానీ వందేళ్ల చిత్రకు సాక్ష్యంగా ఇక్కడ మార్కెట్‌ నిలుస్తోంది. రెండు దశాబ్దాల క్రితం వరకూ పశువుల సంత కూడా ఇక్కడే జరిగేది. వివిధ జిల్లాల నుంచి విభిన్న జాతుల ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలను, వివిధ రకాల పంటలను రైతాంగం ఇక్కడ క్రయవిక్రయాలు జరిపేది. అయితే నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా ఇక్కడి పశువులను సంతను మోతీనగర్‌ సమీపంలోని బబ్బుగూడకు తరలించారు. సాధారణ మార్కెట్‌ మాత్రం ఇక్కడే కొనసాగుతూ వస్తోంది.  

కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు..
వివిధ జాతులకు చెందిన పిల్లులను తెచ్చి అమ్ముతుంటాను. ఎప్పటికప్పుడు తన వద్దకు వచ్చే కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు పెంపుడు జంతువులు తెస్తుంటాం. ఆదివారం వచి్చందంటే ఇక్కడ వ్యాపారం తప్పనిసరి. ఇదే మా కుటుంబ పోషణ.
– ఖాన్, వ్యాపారి

స్పేర్‌ పార్ట్స్‌ కోసం.. 
మొబైల్‌ ఫోన్‌కు అవసరమైన స్పేర్‌పార్ట్స్‌ కోసం ఎల్బీనగర్‌ నుంచి వచ్చా. ఇక్కడ మార్కెట్‌లో ఏది కావాలన్నా దొరుకుతుంది.. మొదటిసారి ఇక్కడికి రావడంతో ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ కొనుగోలు చేసే ప్రతి వస్తువునూ ఇక్కడ చూశాను. 
– మహేష్‌ ఎల్బీనగర్‌  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement