కేసీఆర్పై పొన్నాల పరోక్ష వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఊసరవెల్లిని మించి వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఉద్యమ నేతగా రామోజీ ఫిల్మ్‌సిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తామన్న కేసిఆర్.. ఇపుడు ముఖ్యమంత్రి హోదాలో రామోజీ ఫిల్మ్ సిటీని సందర్శించడంపై ఏమంటారన్న విలేఖరుల అడిగిన ప్రశ్నకు పొన్నాల పరోక్ష ఆరోపణలు చేశారు. కేసీఆర్ను చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడుతున్నాయంటూ వ్యాఖ్యాలు చేశారు.
తెలంగాణలో 69మంది రైతులే ఆత్మహత్య చేసుకున్నారని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. వందలాది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పోలీసుల ఎఫ్ఐఆర్లే స్పష్టం చేస్తున్నాయన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ వందలాది రైతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని పొన్నాల డిమాండ్ చేశారు. ఆత్మహత్యల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను అవమానించేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఆత్మహత్యల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని టీడీపీ, బీజేపీలు సమర్థిస్తాయో, లేదో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. ఇక పార్టీ యువ నేతలు విష్ణు, వంశీల గొడవ కుటుంబ సమస్యగానే భావిస్తున్నామన్నారు.