పేదింట పూసిన విద్యాకుసుమాలు
♦ పిల్లలిద్దరికీ ట్రిపుల్ ఐటీలో సీటు
♦ గతేడాది ఒకరికి.. ఈ యేడాది మరొకరికి
♦ ఆనందంలో తల్లిదండ్రులు
కామారెడ్డి : రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం వారిది. వారికి ఇద్దరు పిల్లలు. కామారెడ్డి పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఇద్దరు పిల్లల్ని జెడ్పీహెచ్‌ఎస్ గంజ్ ఉన్నత పాఠశాలలో చదివించారు. పిల్లలిద్దరూ కష్టపడి చదివారు. గత యేడాది వారి కూతురు ట్రిపుల్ ఐటీకి ఎంపికైతే, ఈ యేడాది కొడుకు ఎంపికై నేనేం తక్కువ కాదని నిరూపించాడు. ఇంకేముంది, ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోరుుంది.
పిట్లంకు చెందిన జంపగల్ల నగేశ్, అన్నపూర్ణ దంపతులు ఇరువై ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కామారెడ్డి పట్టణానికి వ చ్చారు. ఇద్దరూ చెరో పనిచేసుకుంటూ పిల్లలిద్దరిని పోషిస్తున్నారు. చేసిన పనికి వచ్చే కూలీ డబ్బులు తిండికే సరిపోతుండడంతో ప్రైవేట్ పాఠశాలలో చదివించే స్తోమత లేకుండా పోరుుంది. కానీ, వారి నమ్మకాన్ని పిల్లలు వమ్ము చేయలేదు. కష్టపడి చదివారు ఇద్దరూ ట్రిపుల్ ఐటీలో సీటు సాధించారు. ‘తమ కష్టాన్ని పిల్లలు గుర్తించి తగిన ఫలితం ఇచ్చారని’ చెమర్చిన కళ్లతో నగేశ్, అన్నపూర్ణ దంపతులిద్దరూ ‘సాక్షి’తో తమ ఆనందాన్ని పంచుకున్నారు.
పిల్లలే మా వెలుగు...
మా ఇద్దరికీ చదువు రాదు. పిల్లలను సర్కారు బడిలో చది వించాం. పిల్లలిద్దరూ కష్టపడి చదివి మంచి మార్కులు సాధించారు. ఇద్దరూ ట్రిపుల్ ఐటీకి ఎంపికవడం ఆనందం గా ఉంది. మా బావమర్ది చంద్రకాంత్ పిల్లలను ఎంతగానో ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు కూడా ఎంతో సహకా రం అందించారు. పిల్లలే మాకు వెలుగు.
నగేశ్,అన్నపూర్ణ, తల్లితండ్రులు
నాకు తోడుగా తమ్ముడు
ట్రిపుల్ ఐటీకి ఎంపికైన నాకు ఇప్పుడు తమ్ముడు తోడయ్యాడు. ఎంతో సంతోషంగా ఉంది. ఇద్దరం మంచిగా చదువుకుని అమ్మానాన్నకు మంచి పేరు తీసుకొస్తాం. వాళ్లు పడే కష్టం రోజూ చూసి కష్టపడి చదివాం.
నందిని, కూతురు
ఉపాధ్యాయులు ప్రోత్సాహించారు
పదో తరగతిలో 9.7 జీపీఏ రావడానికి మా సార్ల ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మా, నాన్నతో పాటు మామయ్య ప్రోత్సహించారు. మంచి చదువులు చదివి కుటుంబానికి అండగా ఉంటాం.
నితీష్, కుమారుడు