కోరుట్ల : నిరుపేదల ఆవేదనను ‘సాక్షి’ తమ దృష్టికి తెచ్చి ఆసరాగా నిలుస్తోందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని 20వ వార్డులో కౌన్సిలర్ జక్కుల జమున-జగదీశ్వర్ అధ్యక్షతన ‘సాక్షి’ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ ప్రతీ నిరుపేదకు సంక్షేమ పథకాలు చేరాలన్న లక్ష్యంతో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. సాంకేతిక కారణాలతో మొదటి దఫాలో కొంతమంది అర్హులకు పింఛన్లు అందలేదన్నారు. పింఛన్ల పంపిణీ ఈ రోజుతో ఆగిపోయేది కాదని, నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
రీసర్వేకు ఎమ్మెల్యే ఆదేశం
అర్హులైన తమకు పింఛన్లు రావడం లేదని సుమారు 110 మంది ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. స్పందించిన ఆయన 20వ వార్డులో సర్వే సమయంలో పొరపాట్లు జరిగాయని గుర్తించారు. దరఖాస్తులపై రీసర్వే నిర్వహించి అర్హులందరికీ ఆసరా అందించాలని మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డిని ఆదేశించారు. ఇంటింటికి స్వయంగా తిరిగి పింఛన్లందించాలని సూచించారు.
వార్డులో గతంలో 170 పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు 30 మందికి మాత్రమే పింఛన్లు రావడం సర్వేలో లోపంగానే భావిస్తున్నామన్నారు. ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమకు పింఛన్లు రాలేదనే విషయాన్ని ‘సాక్షి’ ప్రజావేదిక ద్వారా తన దృష్టికి తెచ్చారని, అర్హులందరికీ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. మున్సిపల్ చైర్మన్ శీలం వేణు పాల్గొన్నారు.
18 ఏళ్ల పింఛన్ ఆగిపోయింది
నా భర్త 19 ఏళ్ల క్రితం చనిపోయిండు. 18 ఏళ్లుగా నాకు వితంతు పింఛన్ వస్తంది. నెల రోజుల క్రితం సర్వేకు వచ్చిన సారు... నా భర్త చనిపోయిన సర్టిఫికెట్ కావాలని అడిగిండు. అప్పుడు తీసుకోలేదు. లేదన్నాను. అప్పటి సర్టిఫికెట్ గిప్పుడెవలు ఇస్తరు. దీంతో పింఛన్ ఆగిపోయింది. సర్టిఫికెట్లు లేకున్నా పింఛన్ ఇత్తమని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పిండు. మస్త్ సంతోషమనిపించింది. నాకు మళ్ల పింఛన్ వస్తదని నమ్మిక వచ్చింది.
- అందె లక్ష్మీబాయి, కోరుట్ల
మూగబిడ్డకు పింఛన్ ఆపారు
నా బిడ్డ పేరు గాజంగి స్వరూప. పుట్టు మూగ,చెవిటి. ఆమెకు 2008 నుంచి వికలాంగుల పింఛన్ వస్తంది. మొన్నటి నెలల దరఖాస్తు చేసుకొమ్మంటే చేసుకున్నం. సార్లు సర్వే చేసిండ్రు. ఏం జరిగిందో.. ఏమో గానీ నా బిడ్డకు అర్హత లేదని పింఛన్ ఆపేసిండ్రు. వికలాంగురాలైన నా బిడ్డకు పింఛన్ ఇంత ఆసరా ఉంటదనుకున్న. గిట్ల జేసిండ్రు. ఎవరికి చెప్పాలో తెలియలేదు. సాక్షి పేపర్ పుణ్యమా అని ఎమ్మెల్యే సాబ్ పింఛన్ ఇప్పిస్తనన్నడు.
- గాజెంగి స్వరూప, కోరుట్ల 20వ వార్డు
నిరుపేదలకు ‘సాక్షి’ ఆసరా
Published Mon, Dec 8 2014 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement
Advertisement