సాక్షి, హైదరాబాద్ : పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంతో ముగిసింది. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమ శాఖలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13.10 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. దరఖాస్తు గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించలేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 21 వేల మంది విద్యార్థులుంటారని కళాశాల యాజమాన్యాల సంఘం అంచనాలు వేసింది.
దరఖాస్తు గడువు తేదీ ముగియడంతో ఈపాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు నమోదును ప్రభుత్వం నిలిపివేసింది. ఈ క్రమంలో తమ దరఖాస్తులు స్వీకరించాలంటూ ఎస్సీ అభివృద్ధి శాఖకు విద్యార్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు సంబంధిత అధికారులను సంప్రదిస్తుండగా.. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు సైతం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కనీసం వారం పాటు దరఖాస్తుకు అవకాశం ఇస్తే ప్రత్యేక శ్రద్ధతో పూర్తిస్థాయిలో దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యాల సంఘాలు లిఖితపూర్వకంగా లేఖలు సమర్పించాయి. ఈ క్రమంలో వారికి అవకాశం ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment