post metric
-
‘ఉపకారం’.. బహుదూరం
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ మొదలై 5 నెలలవుతున్నా ఇంకా 76 శాతం మంది విద్యార్థులే వివరాలు నమోదు చేసుకున్నారు. నమోదు ప్రక్రియను సర్కారు ఇప్పటికే రెండుసార్లు పొడిగించినా అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. 31తో గడువు పూర్తి కానుండటంతో ఆలోపు 90 శాతం లక్ష్యం చేరుకునేలా కనిపించట్లేదు. దీంతో గడువును మరోసారి పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. సెప్టెంబర్‌లో మొదలు రాష్ట్రంలో పోస్టుమెట్రిక్ కోర్సులు చదువుతున్న వారిలో ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 2021–22 విద్యా సంవత్సరంలో 12.5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. గతేడాది సెప్టెంబర్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాయి. ఈ ప్రక్రియను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని సర్కారు గడువు పెట్టింది. కానీ వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యమవడంతో గడువును నవంబర్ వరకు పొడిగించింది. అయినా అనుకున్న లక్ష్యం పూర్తవకపోవడంతో ఈ నెల 31 వరకు పెంచింది. ఇప్పటికీ కూడా 9.60 లక్షల మందే ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. సంక్షేమ శాఖల అంచనాల ప్రకారం మరో 3 లక్షల మంది నమోదు చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుత గడువులోగా 3 లక్షల మంది నమోదు చేసుకునే అవకాశం లేదు. వాస్తవానికి కాలేజీ యాజమాన్యాలు చొరవ తీసుకుని విద్యార్థులకు అవగాహన కల్పించడం, వాళ్ల నుంచి వివరాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేసేలా చూడాలి. దీనిపై సంక్షేమ శాఖలు కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చినా ప్రక్రియ ఇంకా పూర్తవలేదు. పరిశీలనపై తీవ్ర ప్రభావం ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు గతంలో (కరోనాకు ముందు) నవంబర్ చివరి వారం, డిసెంబర్ రెండో వారం నాటికి 95 శాతం వచ్చేవి. వీటిని ఫిబ్రవరి రెండో వారం కల్లా సంక్షేమ శాఖ అధికారులు పరిశీలించి అర్హతను ఖరారు చేసేవారు. బడ్జెట్ లభ్యతను బట్టి నిధులు విడుదల చేసేవారు. కానీ ఈ సారి దరఖాస్తు ప్రక్రియే ఇంకా కొనసాగుతోంది. లక్ష్యం దూరంలో ఉండటంతో గడువును మరో నెల పొడిగించే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు మరింత ఆలస్యంగా ఉపకార వేతనాలు అందే అవకాశం ఉంది. -
టార్గెట్.. సెప్టెంబర్!
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ కోర్సులు చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను వేగవంతం చేసే దిశగా సంక్షేమ శాఖలు చర్యలు చేపట్టాయి. కోవిడ్–19 ప్రభావంతో 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. వాస్తవానికి ఈ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేసి అర్హతను నిర్ధారించాల్సి ఉండగా, లాక్‌డౌన్‌తో ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. అనంతరం క్రమంగా కార్యాలయాలు తెరిచినా.. విద్యా సంస్థలు మాత్రం తెరవలేదు. దీంతో ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సంక్షేమ శాఖలు ప్రత్యేకంగా లక్ష్యాన్ని నిర్ధేశించాయి. ఈనెలాఖరు కల్లా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలన చేసి అర్హతను నిర్ధారించాలని క్షేత్రస్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశాయి. అర్హత తేలితేనే అంచనాలు... ప్రస్తుతం పోస్టుమెట్రిక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్ ్స టెస్టులు జరుగుతున్నాయి. ఇది కాగానే కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తికానుంది. దీంతో వచ్చేనెలలో నూతన దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కంటే ముందే పెండింగ్‌లో ఉన్నవి పరిశీలించి అర్హత నిర్ధారించాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి. ఈ నెలాఖరులోగా పరిశీలన పూర్తయితే అందులో అర్హత ఉన్నవేవో ఖరారు చేయొచ్చు. అప్పుడు 2019–20 విద్యా సంవత్సరానికి ఉపకారవేతనా లు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు ఎంత నిధులు కావాలో తెలుస్తుంది. 12.73 లక్షల దరఖాస్తులు... ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద రాష్ట్రంలో ప్రతి సంవత్సరం గరిష్టంగా 13 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా 2019–20లో 12.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెన్యూవల్ విద్యార్థులు7.69 లక్షల మంది, కొత్త విద్యార్థులు 6.71లక్షల మంది. గత నెలాఖరు నాటికి 5.78 లక్షల దరఖాస్తులు మాత్రమే పరిశీలించారు. కోవిడ్ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు ఇంటివద్ద నుంచే పనిచేస్తున్నారు. దరఖాస్తులన్నీ ఆన్లైన్లోనే పరిశీలన చేయాల్సి ఉండటంతో వీలైన వారంతా వర్క్ ఫ్రం హోమ్ పద్ధతిలో పరిశీలన చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
ఉపకారవేతనాల దరఖాస్తుకు మరో అవకాశం!
సాక్షి, హైదరాబాద్ : పోస్టు మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల స్వీకరణకు మరో అవకాశం ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి రెండో వారంతో ముగిసింది. దీనిలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ సంక్షేమ శాఖలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 13.10 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. దరఖాస్తు గడువును ఇప్పటికే పలుమార్లు పొడిగించినప్పటికీ పూర్తిస్థాయిలో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించలేదు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో విద్యార్థులు దరఖాస్తుకు దూరమయ్యారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 21 వేల మంది విద్యార్థులుంటారని కళాశాల యాజమాన్యాల సంఘం అంచనాలు వేసింది. దరఖాస్తు గడువు తేదీ ముగియడంతో ఈపాస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు నమోదును ప్రభుత్వం నిలిపివేసింది. ఈ క్రమంలో తమ దరఖాస్తులు స్వీకరించాలంటూ ఎస్సీ అభివృద్ధి శాఖకు విద్యార్థుల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు విద్యార్థులు సంబంధిత అధికారులను సంప్రదిస్తుండగా.. మరోవైపు కాలేజీ యాజమాన్యాలు సైతం దరఖాస్తుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాయి. కనీసం వారం పాటు దరఖాస్తుకు అవకాశం ఇస్తే ప్రత్యేక శ్రద్ధతో పూర్తిస్థాయిలో దరఖాస్తులు సమర్పించేలా చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యాల సంఘాలు లిఖితపూర్వకంగా లేఖలు సమర్పించాయి. ఈ క్రమంలో వారికి అవకాశం ఇవ్వాలా.. వద్దా అనే అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అన్నారు. -
‘ఉపకార’ దరఖాస్తుకు స్పందన కరువు
- ఆశించిన మేరకు రాని దరఖాస్తులు - ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నది 50 వేలే - ఆగస్టు 30తో ముగియనున్న దరఖాస్తు గడువు సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. విద్యాసంవత్సరం మధ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వాలని భావించిన ప్రభుత్వం.. 2017–18కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను 2 నెలల ముందే ప్రారంభించింది. జూన్ మూడో వారం నుంచి ఈ పాస్ వెబ్సైట్ ద్వారా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణకు ఉప క్రమించాయి. ఆగస్టు 30తో దరఖాస్తు గడువు ముగి యనుంది. గడువు ముంచుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఈ విద్యా సంవత్సరంలో 13.5 లక్షల మంది విద్యార్థులుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేసి ప్రాథమిక ప్రణాళికలు రూపొందించాయి. కానీ ఇప్పటివరకు కేవలం 50 వేల మంది విద్యార్థులు మాత్రమే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. గడువు పొడిగింపు లేనట్లే..! గతంలో మాదిరిగా దరఖాస్తు గడువు పొడిగిస్తూ పోతే పరిశీలన ప్రక్రియలో జాప్యం జరుగుతుందని భావించిన యంత్రాంగం... గడువు ముగిశాక వచ్చే దరఖాస్తులను స్వీకరించమని స్పష్టంచేసింది. ఈ క్రమంలో నెలరోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండడంతో... ఆలోపే పూర్తిస్థాయిలో దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు హడావుడి మొదలు పెట్టారు. ఈక్రమంలో విద్యార్థుల నుంచి ఉపకారవేతనాలు, రీయింబర్స్మెంట్ దరఖాస్తులు స్వీకరించేలా కాలేజీల వారీగా సంక్షేమ శాఖలు లేఖలు రాయనున్నాయి. వచ్చే వారం నుంచి జిల్లాస్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
ఉపకార వేతనాల దరఖాస్తుల గడువు పెంపు
ఏలూరు (మెట్రో) : జిల్లాలోని పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్టు సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఈపాస్ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. రేషన్‌కార్డు లేకుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రంతో ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు. ఆన్లైన్లో సమస్యలు ఎదురైతే వారి పరిధిలోని సహాయకుల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఏలూరు డివిజన్లో 9963141266, జంగారెడ్డిగూడెం 7674932132, కొవ్వూరు 9989321976, నరసాపురం 9704782803 డివిజన్ల నంబర్లలో సంప్రదించాలని, ఇదే చివరి అవకాశమని ఆమె పేర్కొన్నారు. -
ఉపకారం ఊసేదీ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తోంది. విద్యాసంవత్సరం ఆరంభమై ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ అధికారులు స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన నిధుల ఊసెత్త డం లేదు. సాధారణంగా ఈ సమయానికే దరఖాస్తుల పరిశీలన పూర్తికావాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఉదాసీన తతో ఇంకా దరఖాస్తుల ప్రక్రియే కొనసాగుతుండడం గ మనార్హం. ఈలెక్కన విద్యార్థులకు ఇప్పట్లో ఉపకారవేతనాలు అందడం కష్టమేనని స్పష్టమవుతోంది. ‘పరిశీలన’ ప్రహసనమే.. ఉపకారవేతనాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే నిధులు మంజూరు చేస్తారు. ఇందుకుగాను పాఠశాల స్థాయినుంచి సంక్షేమ అధికారుల వరకు అంచలంచెలుగా ఈ ప్రక్రియ సాగుతుంది. దాదాపు మూడు దశల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. రాష్ట్రంలోనే అధికంగా మన జిల్లాలో వివిధ కాలేజీలున్నాయి. దాదాపు 1,057 జూనియర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కాలేజీలున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటి పరిధిలో ఇప్పటివరకు 1.85 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలంటే కనిష్టంగా రెండు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ మొదలే కాలేదు. ఈనెలాఖరు నాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే అవకాశముందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టినా.. విద్యాసంవత్సరం ముగిసేనాటికి కూడా ఉపకారవేతనాలు అందేలా లేవు. బడిపిల్లలకూ ‘ఉపకారం’ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఉపకారవేతనాలు పంపిణీ చేస్తోంది. 5 నుంచి 10తరగతి చదివే ఎస్సీ విద్యార్థులు, 9,10 తరగతులు చదివే ఎస్టీ, బీసీ విద్యార్థులు, 1నుంచి 10 వరకు చదివే మైనార్టీ విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు అర్హులు. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ప్రచారం చేపట్టడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. గడువు ముగియడంతో ఇటీవల చాలా మంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు నోచుకోలేదు. అదేవిధంగా అవగాహన కల్పించడంలో విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సైతం దరఖాస్తుకు దూరంగానే ఉన్నారు. తాజాగా పాఠశాల విద్యార్థులకు కూడా ఉపకారవేతనాల పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా సంక్షేమశాఖ అధికారులపైనే ఉండడంతో వారిపై మరింత ఒత్తిడి పెరగనుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కేటగిరీల వారీగా కేటగిరీ ఫ్రెషర్ రెన్యూవల్ ఎస్సీ 5893 22108 ఎస్టీ 2167 8500 బీసీ 22606 75782 ఈబీసీ 3972 26584 మైనార్టీ 4337 13500