‘ఉపకార’ దరఖాస్తుకు స్పందన కరువు
Published Fri, Jul 28 2017 1:00 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM
- ఆశించిన మేరకు రాని దరఖాస్తులు
- ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్నది 50 వేలే
- ఆగస్టు 30తో ముగియనున్న దరఖాస్తు గడువు
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. విద్యాసంవత్సరం మధ్యలోనే విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వాలని భావించిన ప్రభుత్వం.. 2017–18కి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను 2 నెలల ముందే ప్రారంభించింది. జూన్ మూడో వారం నుంచి ఈ పాస్ వెబ్‌సైట్ ద్వారా సంక్షేమ శాఖలు దరఖాస్తుల స్వీకరణకు ఉప క్రమించాయి. ఆగస్టు 30తో దరఖాస్తు గడువు ముగి యనుంది. గడువు ముంచుకొస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఈ విద్యా సంవత్సరంలో 13.5 లక్షల మంది విద్యార్థులుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేసి ప్రాథమిక ప్రణాళికలు రూపొందించాయి. కానీ ఇప్పటివరకు కేవలం 50 వేల మంది విద్యార్థులు మాత్రమే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.
గడువు పొడిగింపు లేనట్లే..!
గతంలో మాదిరిగా దరఖాస్తు గడువు పొడిగిస్తూ పోతే పరిశీలన ప్రక్రియలో జాప్యం జరుగుతుందని భావించిన యంత్రాంగం... గడువు ముగిశాక వచ్చే దరఖాస్తులను స్వీకరించమని స్పష్టంచేసింది. ఈ క్రమంలో నెలరోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండడంతో... ఆలోపే పూర్తిస్థాయిలో దరఖాస్తులు స్వీకరించేలా అధికారులు హడావుడి మొదలు పెట్టారు. ఈక్రమంలో విద్యార్థుల నుంచి ఉపకారవేతనాలు, రీయింబర్స్‌మెంట్ దరఖాస్తులు స్వీకరించేలా కాలేజీల వారీగా సంక్షేమ శాఖలు లేఖలు రాయనున్నాయి. వచ్చే వారం నుంచి జిల్లాస్థాయిలో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement