సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పోస్టుమెట్రిక్ విద్యార్థులకు ఉపకారవేతనాలు మంజూరు చేసే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తోంది. విద్యాసంవత్సరం ఆరంభమై ఆర్నెల్లు కావస్తున్నా ఇప్పటికీ అధికారులు స్కాలర్‌షిప్‌లకు సంబంధించిన నిధుల ఊసెత్త డం లేదు. సాధారణంగా ఈ సమయానికే దరఖాస్తుల పరిశీలన పూర్తికావాల్సి ఉంది. కానీ ప్రభుత్వ ఉదాసీన తతో ఇంకా దరఖాస్తుల ప్రక్రియే కొనసాగుతుండడం గ మనార్హం. ఈలెక్కన విద్యార్థులకు ఇప్పట్లో ఉపకారవేతనాలు అందడం కష్టమేనని స్పష్టమవుతోంది.
‘పరిశీలన’ ప్రహసనమే..
ఉపకారవేతనాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తర్వాతే నిధులు మంజూరు చేస్తారు. ఇందుకుగాను పాఠశాల స్థాయినుంచి సంక్షేమ అధికారుల వరకు అంచలంచెలుగా ఈ ప్రక్రియ సాగుతుంది. దాదాపు మూడు దశల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు. రాష్ట్రంలోనే అధికంగా మన జిల్లాలో వివిధ కాలేజీలున్నాయి. దాదాపు 1,057 జూనియర్, డిగ్రీ, పీజీ, వృత్తి విద్య కాలేజీలున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వీటి పరిధిలో ఇప్పటివరకు 1.85 లక్షల మంది విద్యార్థులు ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలంటే కనిష్టంగా రెండు నెలల వ్యవధి పట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ ప్రక్రియ మొదలే కాలేదు. ఈనెలాఖరు నాటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసే అవకాశముందని సంక్షేమశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో దరఖాస్తుల ప్రక్రియ మొదలు పెట్టినా.. విద్యాసంవత్సరం ముగిసేనాటికి కూడా ఉపకారవేతనాలు అందేలా లేవు.
బడిపిల్లలకూ ‘ఉపకారం’
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కూడా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఉపకారవేతనాలు పంపిణీ చేస్తోంది. 5 నుంచి 10తరగతి చదివే ఎస్సీ విద్యార్థులు, 9,10 తరగతులు చదివే ఎస్టీ, బీసీ విద్యార్థులు, 1నుంచి 10 వరకు చదివే మైనార్టీ విద్యార్థులు ఈ ఉపకారవేతనాలకు అర్హులు. ఇంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంపై ప్రచారం చేపట్టడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది.
గడువు ముగియడంతో ఇటీవల చాలా మంది మైనార్టీ విద్యార్థులు దరఖాస్తుకు నోచుకోలేదు. అదేవిధంగా అవగాహన కల్పించడంలో విద్యాశాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడంతో ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు సైతం దరఖాస్తుకు దూరంగానే ఉన్నారు. తాజాగా పాఠశాల విద్యార్థులకు కూడా ఉపకారవేతనాల పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ దరఖాస్తు పరిశీలన ప్రక్రియ కూడా సంక్షేమశాఖ అధికారులపైనే ఉండడంతో వారిపై మరింత ఒత్తిడి పెరగనుందని ఆ శాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కేటగిరీల వారీగా
కేటగిరీ ఫ్రెషర్ రెన్యూవల్
ఎస్సీ 5893 22108
ఎస్టీ 2167 8500
బీసీ 22606 75782
ఈబీసీ 3972 26584
మైనార్టీ 4337 13500
ఉపకారం ఊసేదీ?
Published Sun, Dec 1 2013 11:56 PM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement