
పోస్టల్ నిర్లక్ష్యం.. హాల్‌టికెట్ ఆలస్యం
రెబ్బెన : ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఓవైపు పోస్టల్ సేవలు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నా.. ప్రజలకు విలువైన సేవలు అందించాల్సిన ఆ శాఖ ఉద్యోగులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఆలస్యంగా హాల్‌టికెట్లు అందజేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి.
పరీక్ష మరుసటిరోజు అందజేత
రెబ్బెన మండల కేంద్రానికి చెందిన దాగం సాయిప్రియ ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి పరీక్షను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో నిర్వహించగా ఆ హాల్‌టికెట్ (నంబర్ 8002084725) ను పోస్టల్ ద్వారా 7వ తేదీన పంపించారు. రెబ్బెన పోస్టాఫీసుకు చేరుకున్న హాల్‌టికెట్‌ను సకాలంలో అందించాల్సి ఉండగా పోస్టల్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి 27వ తేదీన అందించారు.
పరీక్ష కోసం ఎంతో కష్టపడి చదివినా పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా అంతా వృథా అయిందని బాధితురాలు సాయిప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు మండల కేంద్రంలో అనేకసార్లు జరిగినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. సిబ్బందిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులురాలు తెలిపింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది.