కరెంటు ‘కట్’కట
- లైన్ల పునరుద్ధరణ పేరుతో ఎడాపెడా కోతలు
- నగరంపై ఖరీఫ్ ఎఫెక్ట్
- పగలే కాదు.. రాత్రి పూటా తప్పని తిప్పలు
- మంచినీటి సరఫరాకూ ముప్పు
సాక్షి, సిటీబ్యూరో : నగరంలో ఇటీవల రోజూ ఏదో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. గత వారంతో పోలిస్తే ప్రస్తుతం ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం కూడా కాస్త తగ్గింది. కానీ వినియోగదారులకు కోతల వెతలు మాత్రం తప్పడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఇంతకాలం గ్రేటర్‌కు సరఫరా అయిన విద్యుత్ కోటాపై కోత పడుతోంది.
సరఫరాకు, డిమాండ్‌కు మధ్య సుమారు 150 మెగావాట్ల కొరత ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లోనే అనధికారిక కోతలు అమలు చేయాల్సి వస్తోందని డిస్కం స్పష్టం చేస్తోంది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేస్తుండటం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కనీసం కరెంటు ఎప్పుడు పోతుందో, తిరిగి ఎప్పుడు వస్తుందో ముందే చెబితే, ఆ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లైన్ల పునరుద్ధరణ పేరుతో..
బైరామల్‌గూడ డివిజన్ పరిధిలోని శ్రీరమణ కాలనీలో లైన్ల పునరుద్ధరణ పేరుతో గురువారం మధ్యాహ్నం 1.30 నుంచి మూడు గంటల వ రకు సరఫరా నిలిపివేశారు. రాజేంద్రనగర్ డివిజన్‌లో ఉదయం తొమ్మిది నుంచి 10.30 గంటల వరకు సరఫరా నిలిపివేశారు. ఉప్పల్ సర్కిల్లో ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సరఫరా నిలిపివేశారు. నిజానికి తమ ఏరియాల్లో ఎలాంటి పునరుద్ధరణ పనులు చేపట్టలేదని.. ఏఈ, లైన్‌మన్‌లకు ఫోన్ చేస్తే కనీసం స్పందించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు కోత పెట్టడం వల్ల వృద్ధులు, పిల్లలు ఉక్కపోతకు తట్టుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వ ర్షానికి భూపేష్ నగర్ 11 కేవీ సబ్‌స్టేషన్‌లో ఓ ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్ అయిందని, దీని స్థానంలో కొత్తది అమర్చి రీఛార్జి చేసేందుకు గంటన్నర పాటు సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని చంపాపేట్ డీఇ మాధవరెడ్డి వివరించారు.
తాగునీటిపైనా కోతల ఎఫెక్ట్
ఎడాపెడా అమలవుతున్న ఈ కోతలు మంచినీటి సరఫరాకు గండంలా పరిణమించాయి. సరిగ్గా మంచినీరు సరఫరా అ వుతున్న సమయంలోనే విద్యుత్ సరఫరాను కూడా నిలిపి వేస్తుండటంతో మోటార్లు ఆగిపోతున్నాయి. నల్లాలపై ఆధారపడిన బస్తీవాసులు ఇంట్లో చుక్కనీరు లేక అల్లాడుతున్నారు. సామాన్య ప్రజలు కూడా మంచినీటి కోసం వందలాది రూపాయలను వెచ్చించక తప్పని పరిస్థితి నెలకొంది. కృష్ణానది నుంచి నగరానికి నీటిని సరఫరా చేస్తున్న మోటార్లపై కూడా ప్రభావం పడుతోందని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ముఖ్యంగా మంజీరా ఫేజ్-1, 2 పరిధిల్లోని రాజంపేట్, కలగ్గూర్ ప్రాంతాల్లో జలమండలి మంచినీటి పంపింగ్ కేంద్రాలకు సీపీడీసీఎల్ తరుచూ విద్యుత్ కోతలు విధిస్తుండటంతో నగరంలో పలు ప్రాంతాలకు అరకొరగా, ఆలస్యంగా మంచినీరు సరఫరా అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లోని పలు కాలనీలు, బస్తీలకు విద్యుత్ కోతలు శాపంగా పరిణమిస్తున్నాయి.
ఆయా ప్రాంతాలకు ప్రతిరోజూ ఆలస్యంగా, అరకొరగా మంచినీళ్లు సరఫరా అవుతున్నాయి. ఈ పరిస్థితితో మంచినీటి పంపింగ్‌కు కరెంట్ కోతలు లేకుండా చూడాలని కోరుతూ జలమండలి అధికారులు సీపీడీసీఎల్‌కు లేఖ రాసినట్లు తెలిసింది.