దమ్ముంటే బదులివ్వండి! | 'Power' of the Congress, tdp to the Minister ktr challenge | Sakshi
Sakshi News home page

దమ్ముంటే బదులివ్వండి!

Published Fri, Oct 10 2014 2:11 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

దమ్ముంటే బదులివ్వండి! - Sakshi

దమ్ముంటే బదులివ్వండి!

‘విద్యుత్’పై కాంగ్రెస్, టీడీపీలకు మంత్రి కేటీఆర్ సవాల్

తెలంగాణలో థర్మల్ విద్యుదుత్పత్తికి వనరులున్నా.. ప్రాజెక్టులు పెట్టలేదేం?
చంద్రబాబు పీపీఏలు రద్దు చేసినా, విద్యుత్ వాటాను లాక్కున్నా ప్రశ్నించరేం?
ఆ పార్టీల ద్రోహమేమిటో గణాంకాలే చెబుతున్నాయంటూ బహిరంగ లేఖ

 
హైదరాబాద్: తెలంగాణలో నెలకొన్న విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారకరామారావు విమర్శించారు. కానీ మళ్లీ వారే టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదున్నర దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని వాద్రా-డిచ్‌పల్లి విద్యుత్‌లైన్ ఏర్పాటుకు పవర్‌గ్రిడ్ టెండర్లు పిలిచేలా చేసింది తమ ప్రభుత్వమేనని.. దక్షిణ భారతదేశంలోని మార్కెట్‌లో 20 మిలియన్ యూనిట్ల విద్యుత్‌లో ఒక్క తెలంగాణ ప్రభుత్వమే 17.5 ఎంయూలను కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు. విద్యుత్ సంక్షోభంపై కాంగ్రెస్, టీడీపీలకు పలు ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ ఒక బహిరంగ లేఖ రాశారు. దమ్ముంటే ఆ పార్టీలు సమాధానం ఇవ్వాలని సవాలు చేశారు. ఈ లేఖ సారాంశం...

 ‘దేశంలోనే అధికంగా బొగ్గు నిల్వలు ఉన్న తెలంగాణలో విద్యుత్ కొరత ఉండటానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలే కారణం. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని వనరులూ ఉన్న తెలంగాణ ఎందుకు స్వయం సమృద్ధి సాధించలేకపోయింది? 40 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, 17 ఏళ్లు పాలించిన టీడీపీ తెలంగాణకు చేసిన ద్రోహమేమిటో గణాంకాలే చెబుతున్నాయి. రామగుండంలో 1,320 మెగావాట్లు, సత్తుపల్లిలో 600 మెగావాట్లు, కేటీపీఎస్‌లో 800 మెగావాట్లు, భూపాలపల్లిలో 800 మెగావాట్లు... మొత్తం 3,520 మెగావాట్ల ప్లాంట్లు నిర్మించి ఉంటే తెలంగాణలో విద్యుత్ కొరత ఉండేదా? చంద్రబాబు పీపీఏలు రద్దు చేసినా, తెలంగాణకు రావాల్సిన వీటీపీఎస్, ఆర్‌టీపీపీ, సీలేరు విద్యుత్ వాటాను ఆంధ్ర రాష్ర్టం లాక్కున్నా కాంగ్రెస్, టీడీపీ నేతలు ఒక్క మాట ఎందుకు మాట్లాడలేదు. పీపీఏల రద్దులో కృష్ణపట్నం విద్యుత్‌ప్లాంట్ లేనప్పటికీ.. చంద్రబాబు ఎందుకు తెలంగాణకు వాటా ఇవ్వడం లేదు. బాబు హయాంలో శ్రీశైలం విద్యుత్ ప్లాంట్ మునిగిపోయిన విషయాన్ని ఆయన మరిచిపోయారా? ఇప్పుడు ప్రమాదవశాత్తూ జూరాల, సాగర్ ఎడమగట్టు విద్యుత్ ప్లాంట్ మునిగిపోతే కేసీఆర్ పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించడం గురివింద గింజ సామెతను గుర్తుకుతెస్తోంది.

 ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి..

  1966లోనే ప్రతిపాదించిన కుంటాల, ప్రాణహిత, ఇచ్చంపల్లి, కంతనపల్లి, దిండి, సింగారెడ్డిపల్లి జల విద్యుత్‌ప్లాంట్లను నిర్మించకుండా

వదిలేసింది కాంగ్రెస్ కాదా?

1971లో నిర్మించిన 62.5 మెగావాట్ల రామగుండం బి థర్మల్‌స్టేషన్‌ను విస్తరించకుండా గాలికొదిలేసినదీ.. 1978లో మణుగూరులో నిర్మించాలని ప్రతిపాదించిన 1,760 మెగావాట్ల థర్మల్‌స్టేషన్‌ను విజయవాడకు తరలించిందీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా?
  2000వ సంవత్సరంలోనే అన్ని అనుమతులు పొందిన శంకర్‌పల్లి, కరీంనగర్ ప్లాంట్లకు గ్యాస్ కేటాయింపులు జరగకపోవడానికి

మొన్నటిదాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదా?

చంద్రబాబు పీపీఏలను రద్దు చేసుకుని, సీలేరు ప్రాజెక్టులో వాటా ఇవ్వనప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడలేదు?
కృష్ణపట్నం విద్యుత్ ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమైనా.. ట్రయల్ రన్ పేరుతో 350-400 మెగావాట్ల విద్యుత్‌ను ఆంధ్రా ప్రభుత్వం

వాడుకుంటున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనేందుకు  కారిడార్ లేకుండా చేసిందెవరు?

రాయచూర్ నుంచి కర్నూలుకు, కృష్ణపట్నం నుంచి శ్రీకాకుళానికి నిర్మించిన 765 కేవీ సామర్థ్యం కలిగిన విద్యుత్ లైన్లు ఎక్కడా తెలంగాణ ప్రాంతంలో నుంచి పోకుండా వేసిందెవరు?
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement