వీణవంక : ‘రబీలో గుంట భూమి వదలకుండా హైబ్రిడ్(ఆడ, మగ) వరి పంట వేయాలి. ఈసారి అధిక దిగుబడి సాధించాలి. ఎకరంలో రూ.80 వేల లాభం రాబట్టాలి’ వరి విత్తనోత్పత్తి రైతుల నిన్నటి ధీమా ఇది.
‘కరెంటు ఇవ్వలేం. రబీలో ఆరుతడి పంటలు వేసుకోవాల్సిందే’ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన. విత్తనోత్పత్తి రైతులకు షాక్.
‘ఎస్సారెస్పీలో నీళ్లు లేవు. 90 టీఎంసీలకు 19 టీసీఎంలే నిల్వ ఉన్నాయి. ఇవి తాగునీటికే సరిపోతాయి. రబీలో కాలువ కు నీరు వదలడం కుదరదు’ - ప్రాజెక్టు సీఈ శంకర్ ప్రకటన.
విత్తనోత్పత్తిలో జిల్లా టాప్
విత్తనోత్పత్తిలో రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా ప్రథమస్థానంలో ఉంది. 55కు పైగా విత్తనోత్పత్తి కం పెనీలు 25ఏళ్లుగా జిల్లాలో పాగా వేశాయి.ఏటా రూ.100కోట్లకు పైగా రైతులకు చెల్లిస్తున్నాయి. గత రబీలో లక్ష ఎకరాల్లో హైబ్రిడ్(ఆడ, మగ) వరి సాగు చేయగా, నాలుగు లక్షల క్వింటాళ్ల ధాన్యం పండింది. ఈ రబీలో 1.30లక్షల ఎకరా ల్లో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ప్రభుత్వం రబీకి కరెంటు ఇవ్వలేమని తేల్చడంతో 40వేల ఎకరాలు కూడా సాగయ్యే పరిస్థితి కనిపించడంలేదు. కంపెనీలు రైతులకు విత్తనాలు ఇవ్వడం లేదు. పైగా ఇక్కడి నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.
ఇక్కడి నేలలే అనుకూలం
జిల్లాలో వీణవంక, జమ్మికుంట, ఎల్కతుర్తి, జగిత్యాల, మంథని, ముత్తారం మండలం వాగోడ్డు, పొత్కపల్లి, సుల్తానాబాద్ మండలాల్లో హైబ్రిడ్ వరి పంట 20 ఏళ్లుగా సాగు చేస్తున్నారు. ఇక్కడ రబీకి సరపడా నీరుంటుంది. హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి, పోతిరెడ్డిపేట, రంగాపూర్, వెంకట్రావ్‌పల్లి, శంకరపట్నం మండలం గద్దపాక, రాజాపూర్, మెట్టుపల్లి, ఆముదాలపల్లి, కాచాపూర్, మొలంగూర్ ప్రాంతాలు సీడ్‌కు అనుకూలమైనవే. ఇక్కడ పండిన విత్తనం ఎనిమిది ఏళ్లైనా మొలకెత్తే స్వభావం కలిగి ఉండడంతో ఎనిమిది మల్టినేషన్ కంపెనీలు జిల్లాలో పండిన ధాన్యాన్ని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
సవృద్ధిగా నీరుంటేనే..
ఆడ, మగ వరికి నీరు సంవృద్ధిగా ఉండాలి. 128 రోజుల కాలపరిమితి కావడంతో పది తడులన్నా అందించాలి. మొక్కకు 2 సెంటీమీటర్ల వరకు ఎప్పటికీ నీరుండాలి. గింజ పాలు పోసుకొనే సమయంలో పంట ఎండిపోకుండా చూసుకోవాలి. అప్పుడే దిగుబడి ఎక్కువగా వ స్తుంది. గింజ దృఢంగా ఉంటుంది. కంపెనీలు సైతం కొనడానికి ఆసక్తిచూపుతాయి. ఈ పరిస్థితులు ప్రస్తుత రబీలో కనిపించకపోవడంతో నీటి కరువు ఉన్న ప్రాంతాల్లో సీడ్ ఇవ్వలేమని కంపెనీలు రైతులకు స్పష్టంచేస్తున్నారుు.
ముందస్తుగా ఎరువుల కొనుగోలు
ఖరీఫ్ పంట పూర్తి అయ్యిందో లేదో రైతులు రబీకి ముందస్తుగా ఎరువులు కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్నారు. మరో వారంలో విత్తనం జిల్లాకు చేరుతుందని సంబరపడ్డారు. కానీ కంపెనీలు చేతులెత్తయడంతో తెచ్చిన అప్పులు మీద పడుతాయని ఆందోళన చెందుతున్నారు. అదను దాటిపోతుండటంతో గత్యంతరం లేక హైబ్రిడ్(ఆడ,మగ) మొక్కజొన్న పంటలు వేసుకుంటున్నారు. నాలుగెకరాలు ఉన్న రైతులు రెం డెకరాలకే పరిమితమవుతున్నారు. నవంబర్ చివరి వారంలోగా వర్షాలు కురిసినా, కనీసం ఐదు గంటల కరెంటు ఇచ్చినా రబీలో పంటలు పండిస్తామని వారు పేర్కొంటున్నారు.
ఉపాధి కోల్పోనున్న యువత
విత్తన కంపెనీల్లో రైతుల పిల్లలే ఎక్కువగా ఉపాధి పొందుతున్నారు. ఫీల్డ్ ఆఫీసర్, సూపర్‌వైజర్లుగా జిల్లాలో 850 మంది పనిచేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగు తక్కువగా అవుతున్నందు న ఇందులో సగానికి పైగా ఉద్యోగులను కంపెనీలు తొలగించడానికి సిద్ధమవుతున్నాయి.
విత్తనోత్పత్తికి కరెంటు గండం
Published Sat, Nov 15 2014 4:13 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement