
యూటర్న్!
► మనసు మార్చుకున్న ప్రసాద్
► కాంగ్రెస్‌ను వీడేదిలేదని స్పష్టీకరణ
► డిగ్గీ ఫోన్ రాయబారం, సీనియర్ల బుజ్జగింపులతో మెత్తబడిన మాజీ మంత్రి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌ను వీడి.. టీఆర్‌ఎస్‌లో చేరాలనే నిర్ణయంపై వెనక్కి తగ్గారు. అధినాయకత్వం, సీనియర్ల బుజ్జగింపులతో మెత్తబడ్డ ప్రసాద్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టంచేశారు. గురువారం ముఖ్యనేతలు, కార్యకర్తలతో సమావేశమై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకత్వం ఆయనతో రాయబారాలు నడిపింది.
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంట్లో గురువారం పొద్దుపోయేవరకు సీఎల్‌పీ నేత జానారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్ తదితరులు ప్రసాద్‌తో చర్చలు జరిపారు. పార్టీ వీడడానికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయంగా విరోధిగా ఉన్న డాక్టర్ ఏ.చంద్రశేఖర్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం వెనుక కుట్ర దాగి ఉందని, పొమ్మనలేక పొగ పెట్టడంలో భాగంగానే ఆయనకు టికెట్ ఇచ్చారని ప్రసాద్ కుండబద్దలు కొట్టారు. ఆది నుంచి తనకు వ్యతిరేకంగా పార్టీలో ఒకవర్గం పనిచేస్తోందని, ఈ వ్యవహారంలోనూ వారి హస్తం ఉండడంతో మనస్తాపానికి గురయ్యాయని అన్నారు. అంతేగాకుండా చంద్రశేఖర్ అభ్యర్థిత్వంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తనతో సంప్రదించకపోవడం కూడా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాదే భరోసా!
రాజకీయ భిక్ష ప్రసాదించిన పార్టీని వీడడం ధర్మం కాదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వారించారు. పార్టీలో నీ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండదని, వికారాబాద్ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతల్లో కూడా వేరొకరి జోక్యం ఉండదని తేల్చిచెప్పారు. ఈ మేరకు అధిష్టానం నుంచి కూడా హామీ ఇప్పిస్తానని చెప్పిన ఉత్తమ్.. డిగ్గీరాజాతో ఫోన్‌లో మాట్లాడించారు. ఆయన కూడా పార్టీ వీడొద్దని సముదాయించడంతో ప్రసాద్ శాంతించారు.
ఇక ఈ నెల 21న ఢిల్లీలో సోనియాను కలిసేందుకు అపాయిట్‌మెంట్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం జిల్లానేతలు కేఎల్లార్, మల్లేశ్, లక్ష్మారెడ్డి, శ్రీశైలంగౌడ్, శ్రీధర్ తదితరులు ప్రసాద్‌తో మరోసారి రాయబారం నడిపి పార్టీ వీడకుండా ఒప్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన ప్రసాద్ కొన్ని పరిణామాలతో మనసు చివుక్కుమన్నదని, అందుకే పార్టీ మారే అంశంపై ముఖ్యనేతలతో చర్చించానే తప్ప.. మారుతానని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. కుటుంబంలాంటి పార్టీని వీడేదిలేదని, పార్టీ కోసం సీనియర్లతో కలిసి పని చేస్తానని అన్నారు.
ఊగిసలాట!
గులాబీ తీర్థం పుచ్చుకోవాలని దాదాపుగా నిర్ణయించుకొని చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్న ప్రసాద్.. సొంతపార్టీలో కొనసాగు తారా? లేదా కారెక్కుతారా? అనే అంశంపై చ ర్చోపచర్చలు జరుగు తున్నాయి. ఇంతదాకా వచ్చి ఇప్పుడు పార్టీలో కొనసాగడం కష్టమని కొందరు, నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారే తప్ప వెళ్లడం ఖాయమని మరి కొందరు అంటు న్నారు. పార్టీ మార్పిడిపై ప్రసాద్ కుమార్ స్పష్టత నిచ్చినందున... ఆయన పార్టీలోనే ఉంటారా? గులాబీలోకి చేరుతారా అనే అంశంపై కాలమే సమాధానం చెబుతుంది.