
ప్రతిభావంతుడు..మన ప్రభాకరుడు
గంగారం(కాల్వశ్రీరాంపూర్) : ఆయన పేదరికంలో పుట్టి పెరిగారు. సరస్వతీ కటాక్షం పొందాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగారు. కష్టాలకు ఎదురీదుతూ పట్టుదలతో విద్యాభ్యాసం చేసి ఉన్నతస్థాయికి ఎదిగారు. నేడు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్‌లో సిలబస్ మార్పు కమిటీ సభ్యుడిగా నియాకమయ్యారు. ఈ మేరకు టీపీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయనే కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన భైరి ప్రభాకర్. ఆయన తల్లిదండ్రులు రాజవీరు-కనుకమ్మ. తండ్రి చేనేత కార్మికుడు. తల్లి పచ్చళ్లు తయారు చేస్తూ విక్రయించేవారు. వాటిని అమ్మడం ద్వారా ప్రభాకర్ చదువులకు డబ్బు సమకూర్చారు. చెల్లెలు రమ వ్యవసాయ కూలీ పనులు చేసేవారు. ఆమె సంపాదించిన సొమ్మును సోదరుని ఉన్నత విద్యాభ్యాసానికి అందించేవారు.
ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం..
గంగారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించారు. కాల్వశ్రీరాంపూర్‌లో హైస్కూల్, సుల్తానాబాద్‌లో ఇంటర్మీడియెట్ పూర్తి చేశారు. ఏపీపీఎస్సీగ్రూ-4 పరీక్ష రాశారు. అందులో ఉత్తీర్ణులై సిరిసిల్లలోని అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో స్టెనోగ్రాఫర్ ఉద్యోగం సాధించారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్స్‌టర్నల్ పరీక్షలు డిగ్రీ, ఎంఏ, ఎంకాం పూర్తి చేసి అక్కడే అధ్యాపకుడిగా చేరారు. ఎంఫిల్, పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. కాకతీయ యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (మానవ వనరుల అభివృద్ధి)పై పరిశోధన చేసి పీహెచ్‌డీ సాధించారు. ప్రొఫెసరయ్యాక వరంగల్ ఉమెన్స్ కాలేజీ, సిరిసిల్లలో అధ్యాపకుడిగా పనిచేశారు.
సొంతూరిపై మమకారం..
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటూ, కుటుంబ పోషణ విస్మరించలేదు ప్రభాకర్. తల్లిదండ్రులను పోషిస్తూనే తన ఇద్దరు చెల్లెలు పద్మ, రమ వివాహం చేసి అత్తారింటికి పంపించారు. స్వగ్రామంపై మమకారంతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. తాను చదివిన పాఠశాల విద్యార్థులకు పలకలు, పుస్తకాలు, నోటుబుక్కులు, పెన్నులు, దస్తులు అందించారు. చదువులో ప్రతిభ చాటిన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
గురువు చెంతనే చోటు..
ప్రభాకర్ ప్రస్తుతం మెదక్ జిల్లా గజ్వేల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విభాగాధిపతిగా భాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ లింగమూర్తి నుంచి ప్రభాకర్ డాక్టరేట్ పట్టా (కాన్వోకేషన్) అందుకున్నారు. ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ఆయన చెంతనే విధులు నిర్వర్తించే టీపీఎస్సీలో సభ్యుడిగా చేరారు.
అదృష్టంగా భావిస్తున్నా, ప్రభాకర్
మా అమ్మానాన్నతోపాటు చెల్లెళ్లు సైతం నేను చదువుకునేందుకు ఎంతో కష్టపడ్డారు. కనిపెంచి ప్రయోజకుడిని చేసిన అమ్మానాన్న, ఉన్నతస్థాయికి ఎదిగేలా మార్గనిర్దేశం చేస్తూ, ఉన్నత విద్యాభ్యాసంలో ఎదిగేలా కృషి చేసిన గురువులకు రుణపడి ఉంటా. నాపై నమ్మకంతో అప్పగించిన టీపీఎస్సీ సిలబస్ మార్పు కమిటీలో సభ్యుడిగా బాధ్యతగా పనిచేస్తా.