తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పదో పీఆర్‌సీ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు...
- ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో హై పవర్ కమిటీ ఏర్పాటు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పదో పీఆర్‌సీ వ్యవహారంలో ఒక అడుగు ముందుకు పడింది. ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర నేతృత్వంలో ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో హై పవర్ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కమిటీలో చైర్మన్‌గా ప్రదీప్‌చంద్రతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి సంస్థ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, సర్వీసెస్ కార్యదర్శి బి.వెంకటేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. గత ఏడాది మే 29వ తేదీన పదో పీఆర్‌సీ కమిషనర్ ప్రదీప్ కుమార్ అగర్వాల్ తమ నివేదికను గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. రాష్ట్ర విభజన తరువాత గవర్నర్ ఆ నివేదికను రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు పంపించారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదికలోని సిఫారసులను పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పీఆర్‌సీ నివేదికలోని సిఫారసులను పరిశీలించడంతోపాటు ఉద్యోగ సంఘాలతోనూ చర్చలు జరుపుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి, నివేదికలో పరిశీలించిన అంశాలతోపాటు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులు, వారి డిమాండ్లతో కూడిన నివేదికను త్వరగా అందజేయాలని పేర్కొన్నారు.
హైపవర్ కమిటీ ఏర్పాటుకు ముందే ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి నాగిరెడ్డి, కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావులతో సమీక్ష నిర్వహించారు. ఎంత ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకే ఈ హైపవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చెప్పారని తెలుస్తోంది. కాగా పీఆర్‌సీ విషయంలో ప్రభుత్వ కమిటీ ఏర్పాటు పట్ల ఉద్యోగ సంఘాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎక్కువ ఫిట్‌మెంట్‌కు ఉద్యోగుల పట్టు
పీఆర్‌సీలో 69 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని వీలైన ప్రతి సందర్భంలో ఆ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. నగదు రూపంలో వర్తింపును కూడా 2013 జూలై 1 నుంచే ఇవ్వాలని కోరుతున్నాయి. అయితే ఈ రెండు ప్రధాన విషయాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, అధికారుల కమిటీతో ఈ అంశాలు తేలడం సాధ్యం కాదని ఉద్యోగసంఘాలు భావిస్తున్నాయి.
పైగా కపుడునిండా పీఆర్‌సీ ఇస్తానని.. ఈనెల మూడో వారంలో ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో తమను ముఖ్యమంత్రే చర్చలకు పిలుస్తారని భావించారు. పీఆర్‌సీ కమిషనర్ 29 శాతం ఫిట్‌మెంట్‌నే సిఫారసు చేసినా, తాము సీఎం వద్ద పట్టుబట్టి సాధ్యమైనంత ఎక్కువ మొత్తం ఫిట్‌మెంట్ పొందాలని భావించారు. ప్రస్తుతం కమిటీ స్థాయిలో చర్చల తరువాతే సీఎంతో చివరగా చర్చలు జరుగనున్నాయి.