చెన్నూర్ : వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి కుందేటి ప్రమీల (28) శుక్రవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ధర్నాకు దిగారు. వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమీలకు నెలలు నిండడంతో గత మంగళవారం స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికు వెళ్లింది. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యురాలు అరుణశ్రీ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాలని సూచించింది.
అదే రోజు కుటుంబసభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి 12.30 నిమిషాలకు ప్రమీల నార్మల్ డెలివరీ అయిన ప్రమీల మగబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు సత్యనారాయణ బిడ్డ ఆరోగ్య పరిస్థితి బాగలేదని పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లాలని సూచించడంతో ప్రమీల భర్త శ్రీనివాస్ కరీంనగర్ ఆస్పత్రికి వెళ్లగా వైద్యులతోపాటు సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రాత్రి 2 గంటల నుంచి ఉదయం వరకు ప్రమీల కడుపులో మంటగా ఉందని చాలా అవస్థ పడింది. సిబ్బంది, వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందక తెల్లవారు జామున ప్రమీల మృతి చెందిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు. వైద్యులు అందుబాటులో ఉంటే ప్రమీల బతికేదని పేర్కొన్నారు. మృతురాలికి భర్త శ్రీనివాస్, కుమారుడు క్రిష్ ఉన్నారు.
ఆస్పత్రి ఎదుట ఆందోళన
ప్రమీల మృతికి కారణమైన వైద్యులు, సిబ్బందిని సస్పెండ్ చేసి, మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 5 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ఎదుట మృతురాలు బంధువులు, ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌ఎఫ్, సీఐటీయూ, కాంగ్రెస్, ఎస్‌ఎఫ్‌ఐ సంఘాల నాయకులు ధర్నా చేశారు. నాలుగు గంటల పాటు ధర్నా చేయడంతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలియడంతో జిల్లా పరిషత్ ైవె స్ చైర్మన్ మూల రాజిరెడ్డి, తహశీల్దార్ హన్మంతరావు సంఘటన స్థలానికి చేరుకొని వైద్యులను విచారించారు.
వైద్యులపై చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తహశీల్దార్ చెప్పినా ఆందోళన కారులు వినిపించుకోలేదు. వైద్యులకు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో తహశీల్దార్ ఆర్డీవోతో మాట్లాడారు. దళితబస్తీ పథకం ద్వారా మూడు ఎకరాల భూమి, ఆపద్బంధు పథకం కింద రూ.1.50 లక్షలు అందజేస్తామని తహశీల్దార్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లేశ్, చిరంజీవి, కృష్ణమాచారి, తగరం మధురాజ్, మోహన్ పాల్గొన్నారు.
వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి
Published Sat, Nov 22 2014 2:53 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement