మెదక్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా ఓ మహిళ పురిటినొప్పులతో ప్రాణాపాయ స్థితిలో రోడ్డుమీదే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెదక్ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ఫలితంగా ఓ మహిళ పురిటినొప్పులతో ప్రాణాపాయ స్థితిలో రోడ్డుమీదే కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శివంపేట ప్రాంతానికి చెందిన జ్యోతి అనే గర్భిణి పురిటి నొప్పులతో నరసాపూర్ ఆస్ప్తత్రికి వచ్చింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలోనే ఆమె ఆస్పత్రికి చేరుకున్నా, సిబ్బంది ఎవరూ లేరంటూ ఆమెను తిప్పి పంపారు. 9.30 గంటల వరకు కూడా ఎవరూ రాలేదు. సమగ్ర కుటుంబ సర్వే ఉండటం వల్ల సిబ్బంది ఎవరూ రారని చెప్పారు.
వాస్తవానికి వైద్యసేవల లాంటి అత్యవసర సేవలకు సర్వే నుంచి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా, ఇక్కడి ప్రభుత్వ వైద్యులకు కూడా సూపర్వైజర్ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. కనీసం ఆస్పత్రిలో నర్సులు, హెడ్ నర్సు ఉండాల్సి ఉన్నా, సర్వే కోసం వాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లినట్లు చెబుతున్నారు. కనీసం ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఏవీ తెరవకపోవడంతో పురిటినొప్పులతో బాధపడుతున్న జ్యోతి నడిరోడ్డుమీదే ఉండిపోవాల్సి వచ్చింది. ఆమెకు తక్షణం చికిత్స అందించకపోతే ప్రాణాపాయం ముప్పు ఉందని స్థానికులు అంటున్నారు.