పెగడపల్లి ఈదులాగు దాటుతున్న 108 వాహనం
జైపూర్ (చెన్నూర్): భారీ వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మంచిర్యాల జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఆస్పత్రికి తరలించడానికి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జైపూర్ మండలం బెజ్జాల గ్రామ పంచాయతీ పరిధి మద్దులపల్లికి చెందిన పుట్ట అనూషకు ఆదివారం ఉదయం పురిటినొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 వాహనానికి సమాచారం అందించారు. కానీ పెగడపల్లి, గంగిపల్లి వాగుల్లో వరద ఎక్కువగా ఉండటంతో వాహనం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో టేకుమట్ల మీదుగా వెళ్లడానికి ప్రయత్నం చేసినా టేకుమట్ల వాగుపై నుంచి కూడా వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో అక్కడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వారు ఆటోలో ఆస్పత్రికి తరలించడానికి ముందుగా టేకుమట్ల మీదుగా వెళ్లడానికి ప్రయత్నించారు.
వాగు ఒడ్డున 108 వాహనం ఉన్నప్పటికీ వాగు దాటలేని పరిస్థితి నెలకొంది. దీంతో పెగడపల్లి వైపు రావాలని మళ్లీ 108 వాహన సిబ్బంది సమాచారం అందించడంతో వారు పెగడపల్లి వాగు ఒడ్డుకు చేరారు. కానీ అక్కడా వాగు దాటలేని పరిస్థితి. సుమారు గంటకుపైగా సమయం గడిచిన తర్వాత 108 అంబులెన్స్ సిబ్బంది రమేశ్, శంకర్‌లు సాహసోపేతంగా పెగడపల్లి ఈదులాగు దాటించి అనూషను గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు.
Comments
Please login to add a commentAdd a comment