సర్పంచ్‌ ఎన్నికలకు కసరత్తు షురూ  | Preparations Starts For Sarpanch Elections In Kamareddy district | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 26 2018 4:19 PM | Last Updated on Fri, Oct 26 2018 4:19 PM

Preparations Starts For Sarpanch Elections In Kamareddy district - Sakshi

కామారెడ్డి క్రైం: స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలు పెట్టింది. సర్పంచ్‌ల ఎన్నికలు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈసీ కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితాలను సిద్ధం చేయాల్సిందిగా ఎన్నికల సంఘం రెండ్రోజుల క్రితం ఆదేశాల జారీ చేసింది. మార్గదర్శకాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికను జిల్లా ఎన్నికల అధికారులకు పంపించింది. కామారెడ్డి కలెక్టర్‌ నుంచి ఈ మార్గదర్శకాలు జిల్లాలోని ఆయా మండýలాల ఎంపీడీవోలకు చేరాయి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాను సెప్టెంబర్‌ 25న విడుదల చేశారు. ఈ జాబితా ఆధారంగా గ్రామపంచాయతీల ఎన్నికల కోసం ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్‌ నుంచి మార్గదర్శకాలు వచ్చాయి. దీంతో పంచాయితీరాజ్‌శాఖ అధికారులు ఓటరు జాబితా, పోలింగ్‌ స్టేషన్లు, సిబ్బందికి విధుల కేటాయింపు, పోలింగ్‌ అధికారుల ఎంపిక పనుల్లో నిమగ్నమయ్యారు. 

ఇవీ మార్గదర్శకాలు...  
యాక్షన్‌ ప్లాన్‌ ప్రకారం పనులు చేపట్టాలని సూచిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.  

  • సెప్టెంబర్‌ 25న విడుదలైన అసెంబ్లీ ఎన్ని కల ఓటరు జాబితాను అనుసరించి జీపీ ఓ టర్ల జాబితాను సిద్ధం చేయాలి. నవంబర్‌ మూడో వారంలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • నవంబర్‌ చివరి వారం నుంచి డిసెంబర్‌ మొదటి వారంలోగా పోలింగ్‌ స్టేషన్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • నవంబర్‌ చివరికల్లా ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులను ఎంపిక చేయాలి. డిసెంబర్‌ మొదటి వారంలో వారికి శిక్షణ ఇవ్వాలి. ఎంపికలో గెజిటెడ్‌ స్థాయి అధికారులను గుర్తించాలి. 
  • ఎన్నికల వి«ధుల్లో భాగంగా పోలింగ్‌లో పాల్గొనే సిబ్బందిని గుర్తించి బాధ్యతలు అప్పగించాలి. డిసెంబర్‌ రెండో వారానికల్లా వారికి ఆర్డర్లు అందజేయాలి. 

మూడు నెలల్లోగా ఎన్నికలు.. 
సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి ఇప్పటికే మూడు నెలలు గడుస్తోంది. 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల మాదిరిగానే 60 శాతం రిజర్వేషన్లతో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అయితే, సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తూ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కొందరు కోర్టుకు వెళ్లారు. 60 శాతం రిజర్వేషన్లతో బీసీలకు నష్టం జరుగుతుందనేది వారి వాదన. అంతేకాకుండా కులాలా వారీగా ఓటర్ల గణన పూర్తి చేయకుండానే ఎన్నికల్లో రిజర్వేషన్లను ఏ విధంగా అమలు చేస్తారంటూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించడం వీలు కాలేదు. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీలు నడుస్తున్నాయి. 

అయితే, ప్రత్యేకాధికారుల పాలన సరికాదని స్పష్టం చేసిన హైకోర్టు.. మూడు నెలల్లోగా గ్రామపంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 11న ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు రావడంతో ఎన్నికల కమిషన్‌ జీపీ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. దీంతో సర్పంచ్‌ పీఠంపై కన్నేసిన ఆశావహులు అసెంబ్లీ ఎన్నికలు కాగానే పంచాయతీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు. 

ఎన్నికల నిర్వహణ కష్టమే!  
జిల్లాలో మొత్తం 526 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నూతన జీపీల ఏర్పాటుకు ముందు 323 పంచాయతీలు ఉండగా, 214 జీపీలు కొత్తగా ఏర్పడ్డాయి. బాన్సువాడ, ఎల్లారెడ్డి గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా అవతరించాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో గండిమాసానీపేట్‌ జీపీ కలిసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 12 వరకు పంచాయతీ ఎన్నికలకు సమయం ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత సర్పంచ్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సమయం సరిపోదు. కులాల వారీగా ఓటర్ల జాబితాలు ఇప్పటికి సిద్ధంగా లేవు. ప్రభుత్వం ఆదేశిస్తే కులాల వారీగా ఓటరు గణాంకాలను సిద్ధం చేయడానికి కనీసం నెల రోజులైనా పడుతుంది. బీసీ ఓటర్ల గణన చేపట్టాలంటే చట్టబద్ధమైన ప్రభుత్వ సంస్థతో ముందుకు వెళ్లాలి. బీసీ కార్పొరేషన్‌ ద్వారా బీసీ ఓటర్ల లెక్కింపు చేయవచ్చు. కులాల వారీగా ఓటర్ల వివరాలు అందుబాటులోకి వచ్చాకే రిజర్వేషన్లను కేటాయించడానికి వీలవుతుంది. ఆయా కారణాలతో హైకోర్టు సూచించిన ప్రకారం జీపీ ఎన్నికలు మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రణాళిక ప్రకారం పనులు.. 
అసెంబ్లీ ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని జీపీ ఎన్నికల కోసం ఓటరు జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు వచ్చాయి. జీపీ ఎన్నికలకు సంబంధించిన పనులపై కార్యాచరణ ప్రణాళిక విడుదలైంది. ఆయా మండలాల అధికారులకు యాక్షన్‌ ప్లాన్‌ను పంపించాం. ఉన్నతాధికారుల సూచన మేరకు పనులు చేపడుతున్నాం. – రాములు, డీపీవో, కామారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement