
కేంద్రంపై ఒత్తిడి తెండి
♦ తమ సమస్యలను పరిష్కరించాలని జగన్‌కు పొగాకు రైతుల వినతి
♦ కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళతామని ప్రతిపక్షనేత హామీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పొగాకు రైతులను ఆదుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు రైతులు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి వెంకటరావు నేతృత్వంలో పెద్ద సంఖ్యలో రైతులు మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిసి తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 50 వేల మందికి పైగా రైతులు పొగాకు పండిస్తున్నారని, గిట్టుబాటు ధర లేక వారంతా నష్టాల ఊబిలో కూరుకు పోతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైతులకు లాభసాటిగా ఉండే ప్రత్యామ్నాయ పంటలు లేకపోవడం పొగాకు రైతులకు ఆశనిపాతంగా మారిందన్నారు. ప్రభుత్వ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరితో ఏదో రకంగా పొగాకు సాగును నిర్మూలించేందుకు రహస్య యత్నాలు జరుగుతున్నాయని వినతిపత్రంలో వాపోయారు. ఖైనీ, గుట్కా, పాన్‌పరాగ్, బీడీ వంటి వాటిని నియంత్రించకుండా కేవలం ఒక్క సిగరెట్లపైనే 30 నుంచి 70 శాతం పన్ను పెంచేశారన్నారు.
పొగాకు ఎగుమతి కంపెనీలకు రాయితీలు ఇవ్వక వారిని నష్టాలకు గురి చేస్తున్నారని వివరించారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో పొగాకు కిలో ధర రూ. 170 ఉండగా ప్రస్తుతం రూ. 90 నుంచి రూ. 130 లోపు ఉంటోందని రైతులు వాపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ రైతులకు అండగా నిలబడాలని కోరారు. దీనిపై జగన్ స్పందిస్తూ.. పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రుతో ఈ అంశంపై సంప్రదింపులు జరిపేలా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసిన రైతు ప్రతినిధుల్లో కె.రాంబాబు, ఎస్.ఎస్.వి.కె.ఈశ్వర్‌రెడ్డి, ఎస్.జి.జగదీశ్వర్‌రెడ్డి, పి.సుభాష్‌చంద్ర, పి.ప్రసాద్, చవల సుబ్రహ్మణ్యం, కంకట గాంధీ తదితరులున్నారు.