మండుతున్న నిత్యావసరాల ధరలు.. | Prices of essential commodities are highly increases | Sakshi
Sakshi News home page

మండుతున్న నిత్యావసరాల ధరలు..

Published Tue, Aug 5 2014 1:53 AM | Last Updated on Sat, Jul 6 2019 3:22 PM

Prices of essential commodities are highly increases

సాక్షిప్రతినిధి, వరంగల్ : నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. సన్న బియ్యం ధరలు చుక్కల్లోనే ఉన్నాయి. పప్పులు, నూనెలు... అన్ని సరుకులదీ ఇదే తీరు. గత ఏడాదితో పోల్చితే అన్ని సరుకుల ధరలూ పెరిగాయి. వర్షాలు లేక ఈ ఏడాది పంటల సాగు తక్కువగా ఉంది. ముఖ్యంగా ఆహార పంటల సాగు విస్తీర్ణం తగ్గింది. అరుుతే, పంట ఉత్పత్తులు తక్కువగా వచ్చే పరిస్థితి ఉండడంతో వ్యాపారులు, రైస్ మిల్లర్లు నిత్యావసర వస్తువులు, బియ్యూన్ని అక్రమంగా నిల్వ చేస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి.
 
ఇలాంటి సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ, నిఘా విభాగం స్పందించి తనిఖీలు చేయాలి. నిత్యావసరాలను అక్రమ నిల్వ చేసిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా సరుకుల సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ, జిల్లా యంత్రాంగం ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. అక్రమ నిల్వలు, సర్కారు సబ్సిడీ బియ్యం అక్రమాల విషయంలో పౌర సరఫరాల శాఖ, విజిలెన్స్-ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
 
ధరలు పెరిగినప్పుడు తనిఖీలు ఎక్కువగా చేయూల్సి ఉండగా.. దీనికి విరుద్ధంగా జరుగుతోంది. గత ఏడాది తనిఖీలతో పోల్చితే ఈ ఏడాది బాగా తగ్గాయి. ఇదే సమయంలో నిత్యావసరాల ధరలు పెరగడం గమనార్హం. ప్రజా పంపిణీ వ్యవస్థ(రేషన్)లో పారదర్శకత పెంచడం, ఆహార సలహా కమిటీ(ఎఫ్‌ఏసీ) సమావేశం నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. దీనిపై కూడా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎఫ్‌ఏసీ సమావేశం జరగాల్సి ఉంది. 2013 మే 29న ఎఫ్‌ఏసీ సమావేశం జరిగింది. అప్పటి నుంచి సమావేశం నిర్వహించ లేదు. ఇలా 14 నెలలు గడిచినా ఉన్నతాధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
 
ధరల మోత పట్టదు...
పౌర సరఫరాల శాఖకు సంబంధించి జిల్లాలో ఐదుగురు సహాయ సరఫరా అధికారులు(ఏఎస్‌వో), ఐదుగురు ఆహార ఇన్‌స్పెక్టర్లు, 15 మంది ఉప తహసీల్దార్లు ఉన్నారు. జిల్లా స్థాయిలో ఒక ధాన్యం కొనుగోలు అధికారి(జీపీవో), ఈ విభాగం సహాయ అధికారి ఉన్నారు. నిత్యావసరాల అక్రమ నిల్వలను నిరోధించడం.. ప్రజా పంపిణీ వ్యవస్థలోని లోపాలను నివారించడం లక్ష్యంగా వీరు నిత్యం తనిఖీలు నిర్వహించాలి. ప్రజలు నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు దాడులు చేయాలి. ఇలా ప్రత్యేకంగా తనిఖీలు, దాడులు చేసే పౌర సరఫరాల అధికారులు సిబ్బంది కాకుండా.. ప్రతి మండంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉంటారు. ఇద్దరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు ఉంటారు.
 
వీరు కూడా ఈ పనులు చేయవచ్చు. కానీ, అవేమీ జరగడం లేదు. ఎన్నికలు, ఇతర పరిపాలన పనుల్లో రెవెన్యూ శాఖ ఉద్యోగులు పని ఒత్తిడితో ఉన్నా... పౌర సరఫరాల శాఖలోని 27 మంది సిబ్బంది నెలకు ఒకటి చొప్పున తనిఖీలు చేసినా 27 అవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే ఏడు నెలలు గడిచిపోయాయి. ఇలా ఒక్కో అధికారి ఒక తనిఖీ చొప్పున చేసినా వీటి సంఖ్య ఇప్పటికి 189 అయ్యేవి. జిల్లాలో ఇలా జరగడం లేదు. నిత్యావసర సరుకుల బడా వ్యాపారులతో, రైస్ మిల్లర్లతో అధికారులకు, కింది స్థాయి ఉద్యోగుల వరకు ఉన్న సత్సంబంధాల కారణంగా ఎవరూ తనిఖీలు చేయడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేసినా... సంబంధిత వ్యాపారులకు అధికారుల నుంచి ముందుగానే సమాచారం అందుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమ నిల్వలు, ధరలు పెరగడం యథావిధిగా జరుగుతోంది.
 
ప్రభుత్వం సబ్సిడీపై పేదలకు సరఫరా చేసే సరుకులను కొనుగోలు చేయాలంటే కొన్ని ఇతర వస్తువులు తీసుకోవాల్సిందేనని కొందరు రేషన్ డీలర్లు ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చినా పౌర సరఫరాల అధికారులు స్పందించడం లేదు. అన్ని శాఖల్లో అక్రమాలపై నిఘా బాధ్యతల నిర్వహణ కోసం ఉన్న విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సైతం దాడులు, తనిఖీల విధులను దాదాపుగా పక్కనబెట్టింది. ఏదైనా ఫిర్యాదు వస్తే కింది స్థాయి సిబ్బంది అక్కడి వెళ్లి, తర్వాత పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇచ్చి రావడం జరుగుతోంది. నిత్యావసరాల అక్రమ నిల్వలు, ధరల పెరుగుదల విషయంలో పౌర సరఫరాలు, రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఈ వ్యవహారాలను పర్యవేక్షించే జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement