న్యూఢిల్లీ: రైలు రవాణా మరింత భారం కానుంది. రవాణా చార్జీలను అక్టోబర్‌లో పెంచడానికి రైల్వే సన్నద్ధమవుతోంది. ఇంధన భారం పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సర్దుబాటు అంశం (ఎఫ్‌ఏసీ)పై పునఃసమీక్షించి చార్జీలపై నిర్ణయం తీసుకోనుంది. ఎఫ్‌ఏసీ ఆధారంగానే గత ఏప్రిల్‌లో రవాణా చార్జీలను రైల్వే 5.7 శాతం పెంచింది. ప్రయాణికుల చార్జీలు మాత్రం ఈ దఫా పెరగవు. ప్రతి ఆరు నెలలకొకసారి ఇంధన ధరలను సమీక్షించి ఆ మేరకు చార్జీలు పెంచేందుకు వీలుగా బడ్జెట్‌లో ప్రతిపాదించిన ఎఫ్‌ఏసీ ప్రకారం అక్టోబర్‌లో మరోసారి రవాణా చార్జీలు పెరుగుతాయని రైల్వే సహాయ మంత్రి అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు.
మంగళవారం న్యూఢిల్లీలో ‘భారతీయ రైల్వే ఆధునీకరణ- సవాళ్లు, అవకాశాలు’ అంశంపై జరిగిన సదస్సుకు హాజరైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సరుకు రవాణా చార్జీలు మాత్రమే పెరుగుతాయని, ఈసారి ప్రయాణికుల చార్జీలు ముట్టుకోబోమని చెప్పారు. అంతర్జాతీయ విపణిలో చమురు ధరలతో పాటు ప్రస్తుతం స్థిరంగాలేని రూపాయి విలువనూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. రైల్ టారిఫ్ అథారిటీ (ఆర్‌టీఏ) ఏర్పాటు ప్రక్రియను రైల్వే ప్రారంభించిందని, ఈ నెలలోనే దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని వెల్లడించారు.
చైనాను ఆదర్శంగా తీసుకోవాలి: రైల్వే రంగంలో చైనా ప్రగతిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అధీర్ రంజన్ చౌదరి అభిప్రాయపడ్డారు. అలాగే భారత్, చైనాల మధ్య స్నేహసంబంధాలకు కృషి చేయాలని అన్నారు. పొరుగు దేశమైన చైనా రాజధాని బీజింగ్‌కు ఢిల్లీ నుంచి రైలులో ప్రయాణించాలని తాను ఆశిస్తున్నానన్నారు. కాగా, రైల్వే లోకో డ్రైవర్లు, గార్డులు, ఇతర సిబ్బందికి ప్రస్తుతమున్న వసతులను మరింతగా పెంచాలని హైపవర్ కమిటీ సిఫార్సు చేసింది.
రైలు రవాణా భారం!
Published Wed, Aug 28 2013 2:47 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
Advertisement