పరారీ ఖైదీ లొంగిపోయాడు.. | Prisoner Surrendered to police | Sakshi
Sakshi News home page

పరారీ ఖైదీ లొంగిపోయాడు..

Published Sat, Nov 29 2014 4:03 AM | Last Updated on Mon, Jul 30 2018 1:30 PM

పోలీసుల అదుపులో నీలపు వంశీకృష్ణ - Sakshi

పోలీసుల అదుపులో నీలపు వంశీకృష్ణ

న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరు
 చెన్నూర్ అటవీ ప్రాంతంలో బేడీలు

 
 గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని కోర్టు నుంచి గురువారం ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన అండర్ ట్రయల్ ఖైదీ నీలపు వంశీకృష్ణ శుక్రవారం అదే కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడైన వంశీకృష్ణను ఓ హత్యకేసులో గురువారం కోర్టుకు తీసుకురాగా, పరారైన విషయం తెలి సిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు లు వంశీకృష్ణ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఒత్తిడి తేవడంతో అతడు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు.
 
 న్యాయవాది పూర్మ శ్రీనివాస్ ద్వారా శుక్రవారం కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోనే వంశీకృష్ణను వన్‌టౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వంశీకృష్ణను అరెస్ట్ చేశామని, శనివారం కోర్టులో హాజరుపర్చుతామని సీఐ తెలిపారు. వంశీకృష్ణను బైక్‌పై తప్పించిన నాగరాజు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
 చెన్నూరు అటవీ ప్రాంతంలో మకాం..
 అయితే, వంశీకృష్ణ కోర్టు నుంచి తప్పించుకొని ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లాడు. గోదావరినది బ్రిడ్జి దాటిన తర్వాత బైక్‌ను వదిలేసి మరో వాహనంలో చెన్నూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వంశీకృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ బంధువులు న్యాయవాదిని సంప్రదించారు. ఆయన అటవీ ప్రాంతానికి వెళ్లి వంశీకృష్ణను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. వంశీకృష్ణ చేతులకు నూనె రాసి బేడీలను తొలగించుకుని చెన్నూర్ అటవీ ప్రాంతంలోనే పడేశానని తెలిపినట్టు న్యాయవాది వివరించారు.
 
 జైల్లో చంపుతాడనే భయానికే...
 కరీంనగర్ జిల్లా జైలులోనే ఉన్న మరో నిందితుడు తనని చంపుతాడనే భయంతోనే వంశీకృష్ణ పరారైనట్లు న్యాయవాది తెలిపారు. ఈ నెల 11న గోదావరిఖని ఐబీ కాలనీలో ప్రశాంత్ అలియాస్ సన్నీ అనే యువకుడి హత్య కేసులో చందు అనే నిందితుడిని జిల్లా జైలుకు తీసుకొచ్చారు. చందు, వంశీకృష్ణలు హైదరాబాద్‌లో ఉండగా, వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత వారు కలుసుకోలేదు. ఇరువర్గాల మధ్య వైరం అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో చందు తనను చంపుతాడనే భయంతోనే పరారైనట్లు వంశీకృష్ణ చెప్పాడని న్యాయవాది సత్యనారాయణ పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement