ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్తే వైద్యులు ఆపరేషన్ చేసి...కణితులు తొలగించాల్సింది పోయి...సర్జరీ సమయంలో ఉపయోగించే క్లాత్, కాటన్ కుక్కేశారు. దీంతో బాధితురాలికి మళ్లీ కడుపునొప్పి తిరగబెట్టింది. బాధితుల కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండల కేంద్రానికి చెందిన నార్లకంటి లాలమ్మ(43) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అయితే ఆమనగల్లులోని ఓ ఆసుపత్రిలో చూపించగా కడుపులో కణితులు ఉన్నాయని హైదరాబాద్ తీసుకువెళ్లాలని చెబుతూ బాలానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఈ మేరకు లాలమ్మకు గతేడాది ఫిబ్రవరిలో ఆపరేషన్ చేసి ఇంటికి పంపించారు.
ఇటీవల లాలమ్మకు మళ్లీ కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం కర్మన్‌ఘాట్‌లోని అవేర్ గ్లోబల్ ఆసుపత్రిలో చేర్పించారు. కడుపులో ఇంకా కణితులు ఉన్నాయని ఆపరేషన్ చేయాలని అనగా.. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో ఆసుపత్రి వర్గాలు ఆపరేషన్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా కడుపులో కణితులతో పాటు క్లాత్, ఆపరేషన్‌లో వినియోగించే పత్తి ఉండలు బైటపడ్డాయి. గతంలో ఎక్కడ ఆపరేషన్ చేయించారో వాళ్ల నిర్లక్ష్యమేనని అక్కడి ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రి వద్దకు చేరుకుని నిలదీద్దామని వస్తే అది మూసివేశారు. దీనిపై బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఈ విషయంలో న్యాయం జరిగే వరకు పోరాడుతామని లాలమ్మ కుమారుడు శేఖర్ తెలిపారు. చదవండి: ఇది మదురై కాదా..!
Comments
Please login to add a commentAdd a comment