- ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో నగరాన్ని ముంచెత్తిన వేలాది ప్రైవేటు వాహనాలు
- ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్..
- మూడు నుంచి ఐదు గంటలపాటు పద్మవ్యూహంలో చిక్కుకున్న సిటీజనులు
- వేలాదిగా వివాహాది శుభకార్యాలుండడంతో కిక్కిరిసిన రోడ్లు
- ప్రయాణికులకు తప్పని అవస్థలు..
- ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిట
- ఆగని ప్రైవేటు వాహనదారుల దోపిడీ..
- అనూహ్యంగా పెరిగిన పెట్రోలు, డీజిల్ వినియోగం..
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గ్రేటర్ నిండా ప్రైవేట్ వాహనాలే కన్పిస్తున్నాయి. సిటీలోని ప్రైవేటు, వ్యక్తిగత వాహనాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి వస్తున్న వేలాది వాహనాలు నగర రహదారులను ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆదివారం గ్రేటర్ పరిధిలో సుమారు 20 వేలకు పైగా వివాహాది శుభకార్యాలు ఉండడంతో వీటికి హాజరయ్యేందుకు నగరం, పొరుగు జిల్లాల నుంచి సిటీకి వచ్చిన వారు మూడు నుంచి ఐదు గంటలపాటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని విలవిల్లాడారు.
ప్రధాన రహదారులు, ఫ్లైఓవర్లు సైతం వాహనాల తాకిడితో కిక్కిరిశాయి. పెట్రోలు బంకుల వద్ద కూడా కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఎల్బీనగర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం, చంపాపేట్, ఉప్పల్, సాగర్‌రింగ్‌రోడ్డు, బోయిన్‌పల్లి, మేడ్చల్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, మియాపూర్, తార్నాక, నాగోల్, ఎస్.ఆర్.నగర్, ఆబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్ సమస్య కొనసాగింది. విజయవాడ జాతీయ రహదారిపై ఎల్‌బీనగర్ రింగురోడ్డులో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కంటైనర్ లారీ చెడిపోయి నడిరోడ్డుపైనే ఆగిపోయింది. ఇదే సమయంలో మరో వైపు ఇసుక లారీ సాంకేతిక కారణాలతో నడిరోడ్డుపై ఆగిపోవడంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మూడు గంటలపాటు ఈమార్గంలో ట్రాఫిక్ స్తంభించింది.
ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
నగరంలో ఆర్టీసీ కార్మికులసమ్మె ఆదివారం ఐదవరోజుకు చేరింది. గ్రేటర్ పరిధిలోని 28 డిపోల్లో ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి డిపో పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా తమ నిరసన వ్యక్తం చేశారు. ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, బర్కత్‌పుర, కాచిగూడ, జీడిమెట్ల, ఫలక్‌నుమా తదితర డిపోల్లో కార్మికులు పరిసరాలను పరిశుభ్రం చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్టీసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య 660 బస్సులను నడిపారు. అయినప్పటికీ ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు. ప్రైవేట్ వాహనదారుల దోపిడీ కొనసాగింది. స్వల్ప దూరాలకే అందినకాడికి దండుకొని ఆటోలు, కార్లు, జీపులు వంటి ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల జేబులు గుల్లచేశారు.
రైళ్లు కిటకిట..
ఆదివారం ఎంఎంటీఎస్ రైళ్లు కిక్కిరిసి నడిచాయి. ప్రయాణికుల రద్దీ దష్ట్యా సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో ద.మ.రైల్వే 8 ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్లను నడిపింది. సాధారణంగా నడిచే 121 ఎంఎంటీఎస్ రైళ్లకు ఇవి అదనం అని రైల్వే అధికారులు తెలిపారు. రద్దీ అధికంగా ఉండడంతో మహబూబ్‌నగర్, మిర్యాలగూడ, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఆరు ప్యాసింజర్ రైళ్లను నడిపినట్లు ద.మ.రైల్వే అధికారులు తెలిపారు. వేసవి సెలవులు,పెళ్లిళ్లు అధికంగా ఉం డడం సిటీజనం భారీగా ఆయా ప్రాంతాలకు తరలివెళ్లడంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసి కనిపించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది.
ఆగని ప్రైవేటు దోపిడీ..
జూబ్లీ బస్‌స్టేషన్, ఎంజీబీఎస్ పరిసరాల నుంచి ఆయా జిల్లాలకు బయలుదేరిన బస్సులు అరకొరగా ఉండడంతో ప్రైవేటు బస్సులు, వాహనాల యజమానులు ప్రయాణికుల నుంచి రెట్టింపు ఛార్జీలు వసూలు చేశారు. సిద్దిపేట, కరీంనగర్, మెదక్, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి ప్రాంతాలకు అరకొరగానే అద్దె బస్సులు నడిచాయి. నగరం నుంచి పొరుగు రాష్ట్రాలు, నగరాలకు వెళ్లినప్రయాణికులు పెంచిన చార్జీలతో ఆందోళన చెందారు.
భారీగా పెరిగిన పెట్రోలు, డీజిల్ వినియోగం...
గ్రేటర్ నగరంలో సుమారు 447 పెట్రోలు బంకుల వద్ద ఆదివారం సుమారు 40 లక్షల వాహనాలు ఇంధనం కోసం బారులు తీరినట్లు అంచనా. రోజువారీగా నగరంలో 30 లక్షల లీటర్ల పెట్రోలు, 33లక్షల లీటర్ల డీజిల్‌ను విక్రయిస్తారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆదివారం ఒక్కరోజే 40 లక్షల లీటర్ల పెట్రోలు, 50 లక్షల లీటర్ల మేర డీజిల్‌ను విక్రయించినట్లు పెట్రోలు బంకుల డీలర్లు ‘సాక్షి’కి తెలిపారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు స్తంభించడంతో ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత వాహనాలను బయటికి తీస్తుండడం, వీటికితోడు పొరుగు జిల్లాల నుంచి భారీగా ప్రైవేటు వాహనాలు సిటీకి వస్తుండడంతో ఇంధన వినియోగం భారీగా పెరిగినట్లు పేర్కొన్నారు.